D NEWS: హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. జై శ్రీరామ్ నినాదానికి కాంగ్రెస్, సీఎం భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. రాముడు, శివుడి పేరుతో హిందూ సమాజాన్ని విభజించే ప్రయత్నాలు చేయొద్దని అన్నారు.

కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ప్రధాని మోదీ హర హర మహాదేవ్ అంటూ చేసిన నినాదాన్ని ప్రస్తావించారు. మోదీ పోటీ చేసిన వారణాసి శివుడి క్షేత్రం కాదా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలే విమర్శించే పరిస్థితి ఉందని అన్నారు.

ఏబీవీపీ బీజేపీకి అనుబంధ సంస్థ కాదని సీఎం గుర్తించాలని బండి సంజయ్ అన్నారు. సిద్ధాంతపరంగా రెండు సంస్థల మధ్య సారూప్యతలు ఉండొచ్చని, అయితే ఏబీవీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ బీజేపీలో చేరాలనే నిబంధన లేదని స్పష్టం చేశారు.

సంఘ్ పరివార్ ప్రభావం లేని సిలబస్‌పై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కార్యాచరణ రూపొందించాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. చరిత్రలో ఆర్టికల్ 370, అయోధ్య, సర్జికల్ స్ట్రైక్స్, నిజాం పాలన, రజాకార్ల దాడులు వంటి అంశాలను ఎలా బోధిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ అని, దానితో బీజేపీకి సంబంధం ఏమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం విమర్శించుకుంటూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ దిశగా బీజేపీ రెండు పార్టీలతో పోరాడుతోందని తెలిపారు.