భాగ్యనగరంలో ప్రత్యేక గుర్తింపు పొందిన బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈసారి రూ.39 లక్షలకు వేలం వెళ్లింది. అర్బన్ గ్రూప్‌కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి ఈ లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు. గతేడాది రూ.35 లక్షలు పలికిన లడ్డూ ధర ఈసారి మరో రూ.4 లక్షలు పెరిగింది.

21 కిలోల బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం కోసం మొత్తం తొమ్మిది మంది దరఖాస్తు చేసుకోగా వారిలో ఐదు కంపెనీలు ఉండటం విశేషం. వేలంలో మర్రి రవికిరణ్ రెడ్డి (చంపాపేట్), కేవీఏ ఫ్లవర్ మర్చంట్‌కు చెందిన కందాడ శాలిని వీరేందర్ రెడ్డి (చంపాపేట్), కంచర్ల శివ రెడ్డి (హస్తినాపురం), ది సుషీ కోకు చెందిన సామ దయానంద్ రెడ్డి.

సామ వరణంద్ రెడ్డి (లండన్), జీఎన్ఆర్ డెవలపర్స్‌కు చెందిన గడ్డం నవీన్ రెడ్డి (హస్తినాపురం), పీఎస్‌కే గ్రూప్‌కు చెందిన శ్రీకాంత్, ఇబ్రాం ప్రత్యూష్ (బాలాపూర్) తదితరులు పాల్గొన్నారు. చివరకు ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.

బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం 1994లో ప్రారంభమైంది. తొలిసారి ఈ లడ్డూ రూ.450కు వేలం వెళ్లగా, అప్పటి నుంచి ఏటా ధర పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది రూ.39 లక్షలకు చేరుకుంది.

బాలాపూర్ గణేశుడి లడ్డూను సొంతం చేసుకుంటే సుఖసంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. లడ్డూ వేలం పూర్తైన అనంతరం బాలాపూర్ గణేశుడి నిమజ్జన ఊరేగింపు ప్రారంభమైంది. బాలాపూర్ వినాయకుడి విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.

By Rajini