
D News: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ **‘దాదా’**పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. మంచు మనోజ్ కీలకమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
ఇక సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే నాన్-థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 ‘దాదా’ డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కులను కలిపి సుమారు రూ.70 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డీల్‌పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సినిమా విడుదలకు ముందే ఇంత భారీ మొత్తంలో బిజినెస్ జరిగినట్లు వార్తలు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ‘దాదా’ను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
