
DNews: May 08: కొమురం భీమ్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రణహిత ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం ఆయనతో పాటు మంత్రి గద్దం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి ప్రణహిత బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. నీటి లభ్యతపై ఇరిగేషన్ అధికారులతో చర్చలు జరిపారు. నదీ ప్రవాహాన్ని పడవలలో పరిశీలించిన అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ, సంయుక్త ఆదిలాబాద్ జిల్లాలోని మూడు జిల్లాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. బ్యారేజ్‌ను 150 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ముంపు ప్రభావిత ప్రాంతాలకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మే 10న తెలంగాణకు రానున్న ప్రధానమంత్రి మోదీకి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజల ప్రాణాధారమైన ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
అదే సమయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రాణహిత ప్రాజెక్టు కనుమరుగుకి కారణం మాజీ సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలను ప్రాణహిత ప్రాజెక్టు కూడా నిర్మిస్తామని మోసం చేశారని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సహకరించాలని ఆయన కోరారు.
ఈ పరిణామాలతో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని స్పష్టమవుతోంది.
