
D Spiritual: Dec 9: మనలో చాలా మంది రోజును ఉత్సాహంగా ప్రారంభించాలని కోరుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోని ఘటనలు, ఆలోచనలు మన మనసును ప్రభావితం చేసి రోజంతా అసహనంగా గడిచేలా చేస్తాయి. వాస్తు మరియు జీవనశైలి నిపుణుల ప్రకారం, ఉదయం నిద్రలేవగానే కొన్ని రకాల వస్తువులను చూడడం కూడా దీనికి ప్రధాన కారణం కావచ్చు. ఎందుకంటే ఆ వస్తువులు లేదా పనుల మీద ఉన్న బాధ్యతలు మనసులో విసుగు, విరక్తి కలిగించి ప్రతిరోజు పనుల్లో ఆటంకాలను సృష్టిస్తాయని చెబుతున్నారు. వీటి వల్ల మానసిక స్థితి దెబ్బతిని దరిద్రాన్ని ఆహ్వానించినట్టే అవుతుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అలాంటి వస్తువులు, పనులు ఏమిటో తెలుసుకుందాం.
ఉదయం లేవగానే విరిగిన పాత్రలు, పనిచేయని గడియారం చూడడం మంచిది కాదని వాస్తు నిపుణులు అంటున్నారు. వీటిని చూసిన రోజు పనులు సరిగా జరగవని భావన. అందువల్ల ఇలాంటి వస్తువులను ఇంట్లోనే ఉంచకపోవడం ఉత్తమం. కొందరికి నిద్రలేవగానే అద్దంలో తమ ముఖాన్ని చూడడం అలవాటు ఉంటుంది, కానీ ఇది ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని నమ్మకం.
అలాగే ఉదయం సూది, దారాలు, నూనె పాత్రలు చూడడాన్ని అపశకునంగా పరిగణిస్తారు. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయని భావిస్తారు. అంతేకాక ఉదయం మీ నీడను చూడటం మంచిది కాదు. ముఖ్యంగా పడమటి దిశ నుంచి నీడ కనిపిస్తే రాహు ప్రభావం ఉంటుందని జ్యోతిష్యంలో చెబుతారు. పొరపాటున నీడ కనిపించినపుడు తులసి ఆకులు తినడం శుభప్రదమని సూచిస్తారు.
రాత్రి వండిన పాత వంటకాలను ఉదయం చూడడం ఇంట్లో ఆర్థిక సమస్యలను కలిగిస్తుందని నమ్మకం. కొంతమంది ఇళ్లలో జంతువుల చిత్రాలు ఉంచుతారు. అయితే ఉదయం నిద్రలేవగానే ఆ చిత్రాలను చూడటం వివాదాలు, గందరగోళాలను తెచ్చిపెడుతుందని జ్యోతిష్యం చెబుతోంది. అందుకే గదిలో జంతువుల చిత్రాలు ఉంచకుండా ఉండడం మంచిదిగా సూచిస్తారు.
అయితే పడకలేవగానే ఏం చూడాలి? వాస్తు ప్రకారం వ్యక్తి అదృష్టం అతని అరచేతుల్లోనే దాగి ఉంటుంది. అందువల్ల ఉదయం లేవగానే ముందుగా మీ అరచేతులను చూడాలి. చేతివేళ్లను గమనిస్తూ —
‘కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతి, కర్మూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం’
అని జపించి భగవంతుణ్ణి స్మరిస్తూ రోజు ప్రారంభించడం శుభదాయకంగా పరిగణించబడుతుంది.
