
సౌత్ ఇండియాలో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలోనూ వీరిద్దరి పేర్లను కలుపుతూ పలు రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పెళ్లి తేదీ, వేదికకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఈ అంశంపై ఆసక్తి పెరిగింది.
తాజా ప్రచారం ప్రకారం.. అనిరుధ్, కావ్య మారన్ వివాహం ఈ ఏడాది నవంబర్ 10న జరగనున్నట్లు సమాచారం. ఈ వివాహ వేడుకను గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చిన సమయంలో అనిరుధ్ సోషల్ మీడియా ద్వారా వాటిని ఖండించారు. దీంతో తాజాగా వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత అనేది ఆసక్తికరంగా మారింది.
కావ్య మారన్ సన్ గ్రూప్ చైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె. ఆమె ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఎస్ఏ20 లీగ్‌లోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో మాత్రమే వైరల్ అవుతున్న నేపథ్యంలో.. దీనిపై అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు ఈ ప్రచారాన్ని ధృవీకరించలేమని చెప్పాలి.
