
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గరపడటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డు ‘ఇరుముడి’కి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా మొత్తం 2 గంటల 25 నిమిషాల రన్టైమ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ సభ్యుల నుంచి సినిమాకు మంచి స్పందన లభించినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తండ్రి-కూతుళ్ల అనుబంధం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని తెలుస్తోంది. దీనికి తోడు క్రైమ్, సస్పెన్స్ అంశాలను కథలో ఆసక్తికరంగా మేళవించినట్లు సమాచారం. ముఖ్యంగా కథానాయకుడు అయ్యప్ప మాల ధరించిన తర్వాత అతడి ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో చోటుచేసుకునే మార్పులు సినిమాకు కీలక ఆకర్షణగా నిలుస్తాయని టాక్.
దర్శకుడు శివ నిర్వాణ కథను తెరకెక్కించిన విధానం, స్క్రీన్‌ప్లేను నడిపించిన తీరు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. అలాగే జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా మూవీకి బలంగా మారిందని సమాచారం. ‘అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టు’, ‘మల్లెపూల పల్లకి’ పాటలతో పాటు ఆయన అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్లుగా నిలిచాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ‘మల్లెపూల పల్లకి’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు.
‘మల్లెపూల పల్లకి’ పాటలో రామ్ చరణ్ క్యామియో చేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రచారానికి దర్శకుడు స్వయంగా చెక్ పెట్టారు. రవితేజ-శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న ‘ఇరుముడి’పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
