D Spiritual: Nov 10: ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం – ఆంధ్రా శబరిమల

శబరిమల తరహాలో ఆంధ్రలో వెలసిన అయ్యప్ప క్షేత్రం

కేరళ రాష్ట్రంలో వెలసిన ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల. అయ్యప్ప స్వామి ఆలయం అనగానే అందరికీ గుర్తొచ్చేది శబరిమల మాత్రమే! అయ్యప్ప మాల ధరించిన దీక్షాధారులు శబరిమలకు వెళ్లి స్వామిని దర్శించి, దీక్ష విరమించడం తెలిసిందే! అయితే శబరిమల తరహాలో అంతే సమానమైన ఖ్యాతి కలిగిన మరో అయ్యప్ప స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో వెలసి ఉంది. ఈ క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎవరీ అయ్యప్ప?

అయ్యప్ప స్వామిని హరిహరసుతుడుగా, ధర్మశాస్తాగా, మణికంఠుడిగా వ్యవహరిస్తూ పూజిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవదానవులు పంచి పెట్టే సమయంలో శ్రీ మహా విష్ణువు మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహినీ రూపంలో ఉన్న విష్ణువును చూసి శివుడు మోహితుడయ్యాడు. హరిహరుల అవ్యాజమైన దైవిక అనురాగానికి ప్రతిరూపమే అయ్యప్ప స్వామి. మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత శబరిమల కొండల్లో స్వామి వెలిశారని పురాణాలు చెబుతున్నాయి.

శబరిమల అయ్యప్ప దీక్ష

శబరిమల కేరళలో వెలసి ఉంది. ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. అయ్యప్ప మాల ధరించిన దీక్షాధారులు 41 రోజుల కఠిన మండల దీక్ష తర్వాత స్వామిని దర్శించి దీక్ష విరమిస్తారు. విజయదశమి నుంచి మకర సంక్రాతి వరకు కొనసాగే ఈ దీక్ష ఎన్నో కఠిన నియమాలతో కూడుకున్నది. దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన అయ్యప్ప పూజ ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.

శబరిమలకు ప్రత్యామ్నాయం – ద్వారపూడి

కేరళ శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప దీక్షాధారులకు ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం ఉత్తమ ప్రత్యామ్నాయం. ఇక్కడ దర్శనం చేసుకుని దీక్ష విరమించుకునే వెసులుబాటు ఉంది.

ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం – ఆంధ్రా శబరిమల

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ద్వారపూడి గ్రామంలో వెలసిన ఈ ఆలయం ‘ఆంధ్రా శబరిమల’గా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు సాధారణ గ్రామమైన ద్వారపూడి ఇప్పుడు అయ్యప్పస్వామి దివ్య క్షేత్రంగా మారింది.

ఆలయ నిర్మాణం – 1989లో ప్రతిష్ఠ

1989లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు. స్థానిక తమిళ భక్తుడు అచంచల భక్తితో ఆలయ నిర్మాణానికి ముందుండి నడిపించాడు.

ఆలయ విశేషాలు

సువిశాల ప్రాంగణంలో గర్భాలయంలో అయ్యప్ప స్వామి కొలువై ఉన్నాడు. ప్రాంగణంలో హరిహరాదులకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. ముఖద్వారంలో శివకేశవుడు, పశ్చిమంలో పంచముఖ ఆంజనేయుడు అతి పెద్ద విగ్రహాలు ఆకర్షిస్తాయి. క్రింది భాగంలో దుర్గాదేవి, సింహద్వారం, షిరిడీ సాయినాథ్, నవగ్రహాలయం, శేషశయన విష్ణుమూర్తి ఉపాలయాలుగా వెలసాయి.

ఆకట్టుకునే ద్వాదశ జ్యోతిర్లింగాలయం

ఆలయానికి తూర్పు వైపు 200 అడుగుల సొరంగం ద్వారా 40 అడుగుల లోతులో నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగాలయం ప్రత్యేక ఆకర్షణ. పాలరాతితో మూడు అంతస్తుల్లో నిర్మించిన అష్టాదశ ఉమాలింగేశ్వర ఆలయంలో రుషికేశ్, కేదార్‌నాథ్, అమర్‌నాథ్, కాశీ మొ|| 18 పవిత్ర క్షేత్రాల నుంచి తెచ్చిన శివలింగాలు ప్రతిష్ఠితమయ్యాయి. బయట నటరాజు, నందీశ్వరుడు అతిపెద్ద ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటాయి.

పద్దెనిమిది మెట్లు – శబరిమల తరహాలోనే

శబరిమలలా ఇక్కడా స్వామి దర్శనానికి 18 పవిత్ర మెట్లు ఉన్నాయి. తమిళనాడు నుంచి తెప్పించిన ఏకశిలపై నిర్మించిన ఈ మెట్లు విశేషం.

పూజోత్సవాలు

శబరిమల సాంప్రదాయం ప్రకారమే ప్రతిరోజూ పాలాభిషేకం, నెయ్యి అభిషేకం జరుగుతాయి.

మకరజ్యోతి దర్శనం

మకర సంక్రాతి రోజు శబరిమలలా ఇక్కడా మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఈ జ్యోతిని దర్శించినవారికి జన్మరాహిత్యం, మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

ఊరు ఏదైనా భక్తి ఒకటే!

కేరళ శబరిమలను ఎంత భక్తితో దర్శిస్తారో, ద్వారపూడినీ అంతే భక్తి ప్రపత్తులతో దర్శిస్తారు. శబరిమలకు వెళ్లలేని దీక్షాధారులు ఇరుముడి కట్టుకుని ఇక్కడే దీక్ష విరమిస్తారు. విజయదశమి నుంచి మకర సంక్రాతి వరకు, ముఖ్యంగా కార్తిక మాసంలో ఆలయం భక్తజన సంద్రంగా మారుతుంది.

మనకు ఎంతో సమీపంలో ఉన్న ఈ ద్వారపూడి అయ్యప్ప స్వామి క్షేత్రాన్ని మనమూ దర్శిద్దాం… తరిద్దాం!

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప!