
DNews: Apr13: దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ పరీక్షా రిఫరెన్స్ కేంద్రాలు కృష్ణా జిల్లాలోని గన్నవరంలోని మేధా టవర్స్‌లో, రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ప్రారంభం కానున్నాయి. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 14వ తేదీన రెండు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్నారు. క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ కేంద్రాన్ని కలిగి ఉన్న దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. భారతదేశంలో తొలిసారిగా, పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను పరీక్షించి, ధృవీకరించే సామర్థ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి రానుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న రెండు క్వాంటం రిఫరెన్స్ కేంద్రాలలోనూ పూర్తిగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు, పరిశోధకుల కోసం ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో ఒక క్వాంటం రిఫరెన్స్ టెస్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
