D Spiritual: Sept 12: ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తుల తాకిడి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నెల 12 నుంచి 24 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి భక్తుల రద్దీ తగ్గే వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. గణేష్ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

రాజీవ్‌గాంధీ విగ్రహం, రాజ్‌దూత్‌ లేన్‌, ఇక్బాల్‌ మినార్‌, నెక్లెస్‌ రోటరీ, నిరంకారి మార్గాల వైపు వెళ్లే వాహనాలను పోలీసులు వివిధ ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. దీంతో ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్‌ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని సూచించారు.

మరోవైపు ఫాదన్‌ కాలేజ్, అయోధ్య జంక్షన్, మింట్‌ కాంపౌండ్, ఎన్టీఆర్‌ మార్గ్, సచివాలయం, కేసీపీ జంక్షన్, మాసాబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో సాధారణ రోజులతో పోలిస్తే అధిక రద్దీ ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆయా ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాహనదారులు వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వచ్చే భక్తులు, వాహనదారులు ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యలు లేదా అత్యవసర సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే 9010203626 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

భక్తులు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.