D Spiritual: Sept 12: కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం వేకువజామున దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు అధికారులు సాంప్రదాయ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.

పవన్ కళ్యాణ్ దక్షిణ ముఖద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి, అత్యంత పవిత్రమైన మూలవిరాట్టు కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో తిలకించారు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమయ్యే విశిష్ట దర్శనంలో ఆయన పాల్గొన్నారు.

దాదాపు 30 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందురోజు స్వామివారికి చేసిన అలంకరణను తొలగించి నిర్వహించే అభ్యంగన స్నానం, తైలాభిషేకం, వాకచార్థు, శంఖాభిషేకం వంటి సేవల ప్రాముఖ్యతను ఆలయ అధికారులు ఆయనకు వివరించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయంలోని ప్రత్యేక పూజలు, కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో వీక్షించారు.

దర్శనానంతరం ఆలయ ఆచారాల ప్రకారం వెనుక భాగంలో పవన్ కళ్యాణ్ సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, ఆంజనేయస్వామి, అనంత పద్మనాభ స్వామి, భగవతి అమ్మవార్లను దర్శించుకున్నారు.

అలాగే అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురువాయూర్ మేల్ శాంతితో పాటు ప్రధాన అర్చకులు పవన్ కళ్యాణ్‌ను ఆశీర్వదించి స్వామివారి కళభం, ప్రసాదాలను అందజేశారు.

పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఆయనకు ఆయుర్వేద థెరపీ అందించిన వైద్యులు కూడా గురువాయూర్ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.