
D Spiritual: Nov 17: శబరిమల అయ్యప్ప స్వామి వార్షిక మండల యాత్ర ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. యాత్ర సీజన్ నేడు తెల్లవారుజామున 3 గంటలకు లాంఛనంగా ప్రారంభమైంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనానికి సుమారు 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు వర్చువల్ క్యూ ద్వారా రోజుకు 70 వేల మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 20 వేల మందికి మాత్రమే అనుమతి కల్పిస్తున్నారు. అయినప్పటికీ బుకింగ్ లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం, ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా ఒకేసారి సన్నిధికి చేరుకోవడంతో రద్దీ నియంత్రణ అధికారులకు సవాలుగా మారింది.
భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు నీలక్కల్ వద్ద వాహనాల రాకపోకలపై కట్టుదిట్టమైన నియంత్రణ విధించారు. పంబ నుంచి నీలక్కల్ మధ్య కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ప్రత్యేక బస్సులను నడుపుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. క్యూ కాంప్లెక్స్‌లలో భక్తులకు తాగునీరు, ఆహార సదుపాయాలు కల్పించారు.
డిసెంబర్ 27న శబరిమలలో మండల పూజ నిర్వహించనున్నారు. అనంతరం ఆలయాన్ని మూసివేసి, మకర విళక్కు యాత్ర సీజన్ కోసం డిసెంబర్ 30న తిరిగి తెరవనున్నారు. జనవరి 14న పవిత్ర మకర విళక్కు ఉత్సవాన్ని నిర్వహించనుండగా, జనవరి 30న ఆలయాన్ని తిరిగి మూసివేయనున్నారు.
