
D Educt: Oct 24: బీసీ స్టడీ సర్కిళ్లలో కీలక మార్పులు.. సివిల్స్ అభ్యర్థులకు మూడేళ్లపాటు శిక్షణ
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించే లక్ష్యంతో బీసీ స్టడీ సర్కిల్ కొత్త సంస్కరణలను తీసుకొస్తోంది. ఒకసారి బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్ పోటీ పరీక్షల శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు మూడేళ్లపాటు శిక్షణ అందించనుంది. శిక్షణ పొందే అభ్యర్థులకు నెలకు రూ.7 వేల స్టైపెండ్‌తో పాటు ఏడాదికి పుస్తకాల అలవెన్సు కింద రూ.10 వేల నగదు ఇవ్వనుంది. ఈ పెంపునకు నవంబరు 1 నుంచి అమలు చేసేలా బీసీ సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది. బీసీ స్టడీ సర్కిళ్ల బలోపేతం కోసం ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ రాష్ట్రవ్యాప్తంగా 12 స్టడీ సర్కిళ్లను పరిశీలించి నివేదిక సమర్పించింది. ప్రస్తుతం ఈ స్టడీ సర్కిళ్లలో ఫౌండేషన్, షార్ట్‌టర్మ్ శిక్షణ పొందిన అభ్యర్థులు గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు, పోలీసు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను సాధిస్తున్నారు.
సివిల్స్ కోసం ప్రత్యేక రిపీటర్స్ బ్యాచ్‌లు
బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యం మాత్రం ఆశించిన స్థాయిలో నెరవేరడం లేదు. ఒకసారి శిక్షణ తీసుకున్న అభ్యర్థులు తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలకు అర్హత సాధించలేకపోతున్నారు. ఆ తర్వాత వారికి తగిన ప్రోత్సాహం అందడం లేదని ఉన్నతస్థాయి కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో సివిల్స్ పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా రిపీటర్స్ బ్యాచ్‌లను కొనసాగించాలని సిఫార్సు చేసింది.
మూడేళ్లపాటు శిక్షణ.. మరో రెండు అవకాశాలు
బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణకు ఎంపికైన అభ్యర్థి మొదటి ఏడాది సివిల్స్ సాధించకపోతే, మరుసటి ఏడాది రిపీటర్స్-1 బ్యాచ్‌లో ప్రవేశం కల్పిస్తారు. ఇందుకోసం ప్రత్యేక ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. రిపీటర్స్-1 బ్యాచ్‌లో శిక్షణ పొందిన తర్వాత కూడా విజయం సాధించని అభ్యర్థులకు రిపీటర్స్-2 బ్యాచ్‌లో మరో అవకాశం ఇస్తారు. ఇలా అభ్యర్థులు సివిల్స్ సాధించేలా మూడేళ్లపాటు ఇంటెన్సివ్ శిక్షణ, అవసరమైన మార్గదర్శకత్వం అందించనున్నారు.
ఏడాదికి రెండుసార్లు ఫౌండేషన్ శిక్షణ
బీసీ స్టడీ సర్కిళ్లలో ఏడాదికి రెండుసార్లు ఫౌండేషన్ శిక్షణ అందించనున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక బ్యాచ్ చొప్పున నిర్వహిస్తూ, ఒక్కో స్టడీ సర్కిల్‌లో 100 మంది అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. సుమారు 125 రోజులపాటు పోటీ పరీక్షలకు కీలకమైన అంశాల్లో బోధన అందిస్తారు. ఫౌండేషన్ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,500 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.
ప్రత్యేక ప్రవేశ పరీక్షలు.. రిజర్వేషన్ల ప్రకారం సీట్లు
సివిల్స్, ఫౌండేషన్ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తారు. అభ్యర్థులు శిక్షణ పొందేందుకు వీలుగా 12 ఆన్‌లైన్ యూట్యూబ్ ఛానెళ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలను నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ఉదయం 7 నుంచి రాత్రి 11.30 వరకు లైబ్రరీ
హైదరాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్ ప్రధాన కేంద్రంలో తరగతులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయి. తరగతులు లేని సమయాల్లో చదువుకునేందుకు విద్యార్థులు బయట స్టడీ హాళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో వారిపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్టడీ సర్కిల్‌లోనే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు లైబ్రరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో అభ్యర్థులు అదనపు ఖర్చు లేకుండా ఎక్కువ సమయం చదువుకునే అవకాశం కలగనుంది.
