
DNews:24 Dec: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన యూనివర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాన్-టీచింగ్ విభాగంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యూనివర్సిటీ క్యాంపస్‌లో రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ (30) హాజరయ్యాడు.
పరీక్ష రాస్తున్న సమయంలో అనిల్ చెవిలో ఉన్న బ్లూటూత్ డివైస్ నుంచి పదేపదే బీప్ శబ్దం రావడంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం కలిగి తనిఖీ చేపట్టాడు. తనిఖీలో అనిల్ షర్ట్‌కు అమర్చిన స్కానర్ డివైస్ బయటపడింది. ఆ స్కానర్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని స్కాన్ చేసి, బాత్‌రూంకు వెళ్లి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సమాధానాలు తెలుసుకుని, వాటిని చెవిలోని బ్లూటూత్ ద్వారా వింటూ జవాబులు రాస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ఈ ఘటనతో అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు పరీక్ష హాలులోని ఇతర అభ్యర్థులను కూడా క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే హర్యానాకు చెందిన మరో యువకుడు సతీశ్ కూడా ఇదే తరహా హైటెక్ పద్ధతిలో కాపీ చేస్తున్నట్లు తేలింది.
దీంతో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న వర్సిటీ అధికారులు వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
