
DNews: Jan 29: హైదరాబాద్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుకు ఎస్ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు, రేవంత్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్రలను తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తండ్రి, కోట్లాది ప్రజల ఆరాధ్య నాయకుడైన కే.సీఆర్‌పై ఇలాంటి ఆరోపణలు చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకినట్టే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ స్వరాష్ట్రం కలను నిజం చేసి, దశాబ్దం పాటు రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన గొప్ప నాయకుడిని అపవాదులు మోపడం సూర్యుడిపై ఉమ్మినట్టే అని ఆయన అన్నారు.
హరీష్ రావు ఆరోపిస్తూ, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దాచిపెట్టడానికి, పాలనలోని వైఫల్యాలను మరుగునపెట్టడానికి, సింగరేణి బొగ్గు కుంభకోణం మచ్చలను దాచడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది చౌకబారు రాజకీయాల పరాకాష్ట అని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ వేధింపుల ద్వారా లాభపడతానని రేవంత్ రెడ్డి అనుకోవడం రాజకీయ దివాళా అని ఆయన వ్యాఖ్యానించారు.
కే.సీఆర్ చరిత్ర సృష్టించిన నాయకుడు కాగా, రేవంత్ రెడ్డి ఆ చరిత్రను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. అధికారం, అహంకారం శాశ్వతం కాదని, మొత్తం తెలంగాణ సమాజం కే.సీఆర్‌తో ఉందని, ఈ రాజకీయ వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని హెచ్చరించారు
