D Educt: Oct 27: విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు ‘రీడింగ్‌ డిప్లొమా’.. పుస్తకాలు చదివితే బ్యాడ్జీలు, సర్టిఫికెట్లు!

హైదరాబాద్‌: పాఠ్యపుస్తకాలకే పరిమితమవుతున్న విద్యార్థుల్లో సాధారణ పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల్లో పఠనాసక్తి, సృజనాత్మకత, లోకజ్ఞానాన్ని పెంచడమే లక్ష్యంగా ‘రీడింగ్‌ డిప్లొమా’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులు తమ తరగతి పాఠ్యాంశాలకు సంబంధం లేని పుస్తకాలు చదివి, నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేస్తే డిప్లొమా సర్టిఫికెట్‌ పొందవచ్చు. ప్రోత్సాహకంగా బ్యాడ్జీలు, స్టిక్కర్లు కూడా అందజేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

‘రీడింగ్‌ పాస్‌పోర్ట్‌’లో పుస్తకాల వివరాలు

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లోని పుస్తకాలలో తమకు నచ్చిన వాటిని ఎంచుకుని చదవవచ్చు. పాఠశాల గ్రంథాలయం లేదా రీడింగ్‌ కార్నర్‌లో అందుబాటులో ఉన్న పుస్తకాలను వినియోగించుకోవచ్చు. అయితే, పుస్తకాలు చదివినట్లు చెప్పడం మాత్రమే సరిపోదు. వాటి గురించి రెండు వాక్యాలు రాయడం, సారాంశాన్ని వివరించడం లేదా పుస్తకంలోని అంశాలకు అనుగుణంగా బొమ్మలు గీయడం వంటి కార్యకలాపాలు చేయాలి.

విద్యార్థుల పురోగతిని నమోదు చేసేందుకు ‘రీడింగ్‌ పాస్‌పోర్ట్‌’ పేరుతో ప్రోగ్రెస్‌ కార్డు అందజేస్తారు. ఇందులో చదివిన పుస్తకం పేరు, దానిపై తమ అభిప్రాయం, స్పందనను విద్యార్థులు నమోదు చేయాలి. ఉపాధ్యాయులు వాటిని పరిశీలించి సంతకం చేస్తారు. ఈ రీడింగ్‌ పాస్‌పోర్ట్‌ కార్డులను ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం ముద్రించి పాఠశాలలకు పంపిస్తుంది.

మైలురాళ్లు చేరుకున్నవారికి బ్యాడ్జీలు, స్టిక్కర్లు

విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకు నెలకోసారి పాఠశాలల్లో రీడింగ్‌ ఉత్సవాలు నిర్వహించాలని మార్గదర్శకాల్లో సూచించారు. నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం పుస్తకాలు చదువుతూ 1, 5, 10, 15, 20, 25 తదితర మైలురాళ్లను చేరుకున్న విద్యార్థులను అభినందిస్తారు. వారికి బ్యాడ్జీలు, స్టిక్కర్లు అందజేసి మరిన్ని పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తారు.

లక్ష్యాన్ని పూర్తి చేస్తే డిప్లొమా సర్టిఫికెట్‌

విద్యా సంవత్సరంలో నిర్దేశించిన పుస్తక పఠన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆమోదంతో రీడింగ్‌ డిప్లొమా సర్టిఫికెట్‌ అందజేస్తారు. విద్యార్థులు చదివిన పుస్తకాల సంఖ్యతో పాటు వాటిపై తమ అవగాహనను వ్యక్తపరచడం ద్వారా పఠన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా 2,935 పాఠశాలల్లో అమలు

ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2,935 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) ఉన్నాయి. పాఠశాలల్లో రీడింగ్‌ కార్నర్లను అభివృద్ధి చేయడం, పుస్తక పఠనానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.

ఒక్కో పాఠశాలకు రూ.5,803 కేటాయింపు

రీడింగ్‌ కార్యక్రమం అమలుకు సమగ్ర శిక్షా ప్రాజెక్టు ద్వారా ఒక్కో పాఠశాలకు మొత్తం రూ.5,803 కేటాయించనున్నారు. ఇందులో రీడింగ్‌ కార్నర్‌లో మ్యాట్‌లు, పుస్తకాలు ఉంచేందుకు ట్రేల కొనుగోలుకు రూ.3,000, విద్యార్థులకు బ్యాడ్జీలు, స్టిక్కర్లు అందించేందుకు రూ.1,500, నెలవారీ రీడింగ్‌ మేళాల నిర్వహణకు రూ.800 కేటాయించారు.

అలాగే, విద్యా సంవత్సరం ముగింపులో జిల్లా స్థాయిలో రీడింగ్‌ మేళా నిర్వహణ, సర్టిఫికెట్ల పంపిణీ కోసం ఒక్కో పాఠశాలకు అదనంగా రూ.503 అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం మొత్తం రూ.1.70 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చొరవతో విద్యార్థుల్లో పుస్తక పఠన అలవాటు పెరగడంతో పాటు భాషా నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచన, సాధారణ పరిజ్ఞానం మెరుగుపడతాయని విద్యాశాఖ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana