
D Spiritual: Oct 16: దీపావళి రోజున లక్ష్మి, గణేశుని పూజించడం సంప్రదాయం. అంతేకాదు, ఈ రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక ఆచారాలు కూడా నిర్వహిస్తారు. ఇవి చాలా ముఖ్యమైనవి. నమ్మకాల ప్రకారం, ఈ రోజున విష్ణు ప్రియ తులసి మొక్కను సాంప్రదాయం, ఆచారాల ప్రకారం పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
హిందువులు జరుపుకునే పండగలలో దీపావళి పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అమావాస్య చీకట్లను దీపాల వెలుగులతో తొలగించే ఈ దీపాల పండుగను పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున దీపావళి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. లక్ష్మీదేవి, గణేశుడిని పూజిస్తారు.
దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుందని, సిరి సంపదలకు లోటు ఉండదని, అదృష్టం పెరుగుతుందని మత విశ్వాసం. అంతేకాదు, లక్ష్మీదేవి ఆశీస్సులు ఆ ఇంటి సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు.
దీపావళి రోజున లక్ష్మీదేవి, గణపతిని పూజించడంతో పాటు, లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక ఆచారాలు కూడా నిర్వహిస్తారు. ఇవి చాలా ముఖ్యమైనవి. నమ్మకాల ప్రకారం, ఈ రోజున తులసితో కూడిన ఆచారాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి జీవితంలో శ్రేయస్సు వస్తుంది. దీపావళి రోజున తులసి మొక్కను ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి 2025 ఎప్పుడు?
వేద క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అమావాస్య అక్టోబర్ 20న తెల్లవారుజామున 03:44 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 21న ఉదయం 05:54 గంటలకు ముగుస్తుంది. కనుక ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20న జరుపుకుంటారు.
దీపావళి నాడు తులసిని ఎలా పూజించాలి?
తులసి దగ్గర దీపం వెలిగించండి:
దీపావళి నాడు తులసి మొక్క దగ్గర దేశీ ఆవు నెయ్యి దీపం వెలిగించి, తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఈ పరిహారం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు సురక్షితమైన జీవితాన్ని అందిస్తుంది.
తులసి పూజ:
దీపావళి రోజున తులసి పూజ చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత, తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కకు వైవాహిక జీవితంలో ఆనందం కోసం పసుపు, కుంకుమ, గాజులు, రవిక పెట్టి పూజ చేసి, ఆవు పాలతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ వస్తువులను వివాహిత స్త్రీకి వాయినంగా అందించాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుంది.
తులసి మొక్కకు గంగా జలం సమర్పణ:
దీపావళి నాడు కొద్దిగా గంగా జలం కలిపిన నీటిని తులసికి సమర్పించాలి. తులసి మంత్రాలను కూడా జపించాలి. దీపావళి నాడు ఈ విధంగా చేసే పూజా పరిహారాల వల్ల శుభ ఫలితాలు వస్తాయి. లక్ష్మీ దేవి ఆశీస్సులతో నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.
