D Spiritual: Nov 17: పవిత్ర కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ములకలపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఉమా పృథ్వీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనం కోసం బారులు తీరడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. భక్తుల పంచాక్షరీ నామస్మరణ ‘ఓం నమః శివాయ’తో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి మూలవిరాట్టుకు పంచామృతాలు, పవిత్ర జలాలతో మహా రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు.

కార్తీక మాసం విశిష్టతను పురస్కరించుకుని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోయింది.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దర్శన ఏర్పాట్లతో పాటు ఇతర సౌకర్యాలను దగ్గరుండి పర్యవేక్షించారు.

ఈ వేడుకల్లో ములకలపల్లి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *