D news:nov:16కేరళలోని మలప్పురం జిల్లాలో షిగెల్లా బ్యాక్టీరియా కలకలం రేపుతోంది. జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఇన్ఫెక్షన్ కేసులు నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో సుమారు 75 షిగెల్లా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఎనిమిది మంది బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారికీ ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా అధికారులు నిఘా పెంచడంతో పాటు నివారణ చర్యలను ముమ్మరం చేశారు.

మలప్పురం జిల్లాలోని అరీకోడ్‌, పుల్పట్ట, ఎడవన్న ప్రాంతాల్లో తాజాగా షిగెల్లా కేసులు వెలుగుచూడటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (RRT) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితిని సమగ్రంగా సమీక్షించిన అధికారులు, వ్యాధి మరింత విస్తరించకుండా తీసుకోవాల్సిన నివారణ, నియంత్రణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు, పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేయాలని నిర్ణయించారు.

షిగెల్లా బ్యాక్టీరియా సోకిన ఒకటి లేదా రెండు రోజుల్లోనే లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా తరచూ విరేచనాలు కావడం, మలంలో రక్తం లేదా చీము పడటం, తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం, వాంతులు, శరీరంలో నీరు తగ్గిపోవడం (డీహైడ్రేషన్) వంటి సమస్యలు తలెత్తుతాయి. లక్షణాలు కనిపించని చిన్నారుల ద్వారా కూడా ఇతరులకు ఈ బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వి. వినోద్ హెచ్చరించారు. సకాలంలో చికిత్స అందకపోతే మెదడు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చని తెలిపారు.

షిగెల్లా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా బహిరంగ విందులు, సామూహిక భోజనాలపై అధికారులు తాత్కాలిక నిషేధం విధించారు. ఆరోగ్యశాఖ, స్థానిక స్వపరిపాలన సంస్థలు, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సంయుక్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలు, నిల్వ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

షిగెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆహార, తాగునీటి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.

  • తాగడానికి, వంట చేయడానికి కాచి చల్లార్చిన నీటినే ఉపయోగించాలి.
  • తాజాగా తయారుచేసిన, పూర్తిగా ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
  • ఎక్కువసేపు నిల్వ ఉంచిన ఆహారం, బహిరంగ ప్రదేశాల్లో అపరిశుభ్రంగా విక్రయించే పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • తాగునీటి వనరులను క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయాలి.
  • కూరగాయలు, పండ్లను శుభ్రమైన నీటితో కడిగిన తర్వాతే వినియోగించాలి.
  • భోజనానికి ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

విరేచనాలు ప్రారంభమైన వెంటనే శరీరంలో నీరు, లవణాలు తగ్గకుండా ఓఆర్‌ఎస్‌ (ORS) ద్రావణం అందించాలి. వైద్యుల సూచనల మేరకు తగిన ద్రవాహారం తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారుల్లో డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. సొంత వైద్యం, వైద్యుల సూచన లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం మానుకోవాలి. రక్త విరేచనాలు, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్య చికిత్స పొందాలి.

ప్రజలందరూ పరిశుభ్రత, సురక్షిత ఆహారం, శుద్ధమైన తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపి షిగెల్లా వ్యాప్తిని అరికట్టడంలో భాగస్వాములు కావాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *