
D news:nov:16శరీరాన్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షించడంలో రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడుతూ శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే రోగనిరోధక శక్తి బలహీనపడితే ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయని వారిలో వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం రోజూ పాటించే కొన్ని అలవాట్లు కూడా రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. మరి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం.
నిద్రలేమితో రోగనిరోధక శక్తికి ముప్పు!
రాత్రిపూట తగినంత నిద్రపోకపోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. 2019లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం, రోగనిరోధక కణాలు సమర్థంగా పనిచేయాలంటే రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర సరిగా లేకపోతే ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయులు పెరిగి, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా, నిద్ర సమయంలో శరీరంలో సైటోకిన్లు అనే ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు తోడ్పడతాయి.
జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి
ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్, అధిక చక్కెర కలిగిన ఆహారాన్ని తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో అవసరమైన పోషకాలు తక్కువగా ఉండటంతో రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పోషక విలువలున్న పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
శారీరక శ్రమ లేకపోయినా ప్రమాదమే!
ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, శారీరక శ్రమకు దూరంగా ఉండటం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక కణాలు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన కథనం కూడా శారీరక శ్రమ ప్రాధాన్యాన్ని వివరించింది. అందువల్ల ప్రతిరోజూ కొంత సమయం నడక, యోగా లేదా ఇతర తేలికపాటి వ్యాయామాలకు కేటాయించడం మంచిది.
మద్యపానం, ధూమపానంతో అనర్థాలు
అధికంగా మద్యం సేవించడం రోగనిరోధక వ్యవస్థ పనితీరును బలహీనపరచవచ్చు. దీనివల్ల శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగం కూడా రోగనిరోధక ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా ధూమపానం శరీరంలోని రక్షణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అవసరం.
