
DNews: రంగారెడ్డి జిల్లా శ్రీరామనగరంలో జరుగుతున్న యతీంద్ర సప్తతి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సమాజానికి విశేష సేవలందిస్తున్న 70 మంది మాతృమూర్తులను త్రిదండి చిన్న జీయర్ స్వామి ఘనంగా సత్కరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలకు శాలువాలు కప్పి ఆశీస్సులు అందించారు.
వివిధ రంగాల మహిళలకు గౌరవం
మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు సతీమణి శ్రీకుమారి, ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త శైలజా కిరణ్, సివిల్స్ కోచ్ బాలలతతో పాటు పలువురు మహిళలు ఈ సన్మానం అందుకున్నారు.
సమాజ హితం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న మహిళలను గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉందని చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు.
మహిళలకు సమాన ఆధ్యాత్మిక హక్కులు
అనుగ్రహ భాషణంలో చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయంలో మహిళలకు అత్యున్నత గౌరవం ఉందన్నారు. వేల సంవత్సరాల క్రితమే మహిళలకు మంత్రోపదేశం, సమాన ఆధ్యాత్మిక హక్కులు కల్పించిన ఘనత రామానుజాచార్యులకు దక్కుతుందని తెలిపారు.
లింగ వివక్ష, మూఢనమ్మకాలు ఉన్న కాలంలోనే రామానుజాచార్యులు సమానత్వ భావనను చాటిచెప్పారని గుర్తు చేశారు.
ప్రేమ, కరుణే నిజమైన మానవత్వం
భగవంతుడి సృష్టిలో కుల, మత, లింగ భేదాలకు స్థానం లేదని స్వామిజీ అన్నారు. ప్రతి ప్రాణిలోనూ దైవత్వాన్ని చూడటమే నిజమైన మానవత్వమని వివరించారు. మనుషులు, జంతువులు, పక్షులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమతో చూడాలని పిలుపునిచ్చారు.
