
D news:nov:9
బియ్యం – 1 గ్లాసు
- నూనె – 3 టేబుల్ స్పూన్లు (పచ్చిమిర్చి మసాలా కోసం 2 టీస్పూన్లు సహా)
- నెయ్యి – 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి – 6
- వెల్లుల్లి రెబ్బలు – 6
- అల్లం – 1 అంగుళం ముక్క
- పుదీనా ఆకులు – ఒక గుప్పెడు
- కొత్తిమీర – ఒక గుప్పెడు
- మెంతికూర – కొద్దిగా
- దాల్చినచెక్క – 1 అంగుళం ముక్క
- బిర్యానీ ఆకు – 1
- లవంగాలు – 3
- యాలకులు – 2
- రాతిపువ్వు – కొద్దిగా
- ఉల్లిపాయ – 1 (మీడియం సైజు)
- టమాటాలు – 2 (మీడియం సైజు)
- పసుపు – ½ టీస్పూన్
- ధనియాల పొడి – 1 టీస్పూన్
- జీలకర్ర పొడి – ½ టీస్పూన్
- గరం మసాలా – ½ టీస్పూన్
- బంగాళదుంపలు – 2
- పచ్చి బఠానీలు – ¼ కప్పు
- ఉప్పు – రుచికి సరిపడా
- నీళ్లు – 2 గ్లాసులు
తయారీ విధానం
ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడిగి, బియ్యం మునిగేంత నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా మెంతికూర వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, రాతిపువ్వు వేసి తేలికగా వేయించుకోవాలి.
తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి. రెండు టమాటాలను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌ను కూడా కుక్కర్లో వేయాలి. ఈ మిశ్రమాన్ని మీడియం మంటపై నూనె పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలాలోని పచ్చివాసన పోయి మంచి రుచి వస్తుంది.
ఇప్పుడు ఇందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు, పచ్చి బఠానీలు, తగినంత ఉప్పు వేసి అన్నీ మసాలా పట్టేలా కలపాలి.
ఇప్పుడు నానబెట్టిన బియ్యంలో నీళ్లు వంపేసి కుక్కర్లో వేయాలి. బియ్యం విరిగిపోకుండా నెమ్మదిగా కలపాలి. ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసి మరోసారి కలపాలి.
తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్లోని ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే మూత తీసి చూడాలి.
అంతే! ఎంతో రుచికరమైన, సువాసనభరితమైన వెజిటబుల్ రైస్ సిద్ధం.
రంగురంగుల కూరగాయలు, ఘుమఘుమలాడే మసాలాలతో తయారయ్యే ఈ వెజిటబుల్ రైస్‌ను పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టి పంపించవచ్చు. పెరుగు లేదా రైతాతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ ప్రయత్నించి చూడండి. ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!
