
D Spiritual: Nov 7: సింహాచలం ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్ అమలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల కోసం నూతన వస్త్ర నిబంధనలు (డ్రెస్ కోడ్) అధికారికంగా అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు సనాతన ధర్మ సంప్రదాయాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులందరూ కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
కొత్త డ్రెస్ కోడ్ ప్రకారం పురుషులు పంచె-కండువా లేదా కుర్తా-పైజామా ధరించి స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే సాధారణ ఫార్మల్ ప్యాంట్, షర్ట్ ధరించిన భక్తులకు కూడా అనుమతి ఉంటుంది. మహిళలు చీర, లంగా-ఓణీ లేదా చుడీదార్ ధరించి ఆలయానికి రావాల్సి ఉంటుంది. చుడీదార్ ధరించే మహిళలు తప్పనిసరిగా దుపట్టా వేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
ఇక టీ-షర్టులు, షార్ట్స్ (నిక్కర్లు), స్లీవ్‌లెస్ టాప్స్ వంటి దుస్తులు ధరించి వచ్చే భక్తులను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించరు. ఈ నిబంధనలు సాధారణ దర్శనానికి వచ్చే భక్తులతో పాటు అర్జిత సేవల్లో పాల్గొనే వారికి కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలపై భక్తులకు ముందుగానే అవగాహన కల్పించేందుకు దేవస్థానం విస్తృత ప్రచారం చేపడుతోంది.
నవంబర్ 8న ప్రత్యేక దర్శన వేళలు
నవంబర్ 8, ఆదివారం నరక చతుర్దశి, స్వాతి నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలం ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల నేపథ్యంలో ఆ రోజు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.
కాబట్టి స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులు ఈ ప్రత్యేక సమయ మార్పును గమనించి, అందుకు అనుగుణంగా తమ దర్శన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆలయ వర్గాలు సూచించాయి.
