
హైదరాబాద్, నవంబర్ 6: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ అభిమాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఏకంగా 350 కిలోమీటర్లు కాలినడకన హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయనతో ముఖ్యమంత్రి కొద్దిసేపు మాట్లాడి, కండువా కప్పి పంపించారు.
ఈ భేటీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ సెటైర్లు వేస్తున్నారు.
కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఆంధ్రా అభిమాని ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాడంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, రైతుల పరిస్థితిని పట్టించుకోకుండా పొరుగు రాష్ట్రానికి నీళ్లు వదులుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు, 350 కిలోమీటర్లు నడిచి వచ్చిన అభిమానికి కనీసం భోజనం పెట్టి, తిరుగు ప్రయాణానికి టికెట్ అయినా ఇచ్చి ఉండాల్సిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
ఇంకో నెటిజన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ విముక్తి పోరాటంలో మీ పాత్ర లేకపోవడంతో సీమ సోదరుడు మీపై అభిమానాన్ని పెంచుకొని ఉంటాడేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ అభిమాని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు చేసిన సుదీర్ఘ ప్రయాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ రాజకీయ విమర్శలు, సెటైర్లతో పోస్టులు పెడుతున్నారు.
