
IRCTC Kerala Tour Package: కేరళ అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో ప్రారంభమయ్యే ఈ 7 రోజుల ‘కల్చరల్ కేరళం’ టూర్లో కేరళలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించవచ్చు. కొచ్చి, గురువాయూర్, మున్నార్, థెక్కడి, కుమారకోమ్, వర్కల, తిరువనంతపురం వంటి ప్రాంతాలు ఈ ప్రయాణంలో భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా హౌస్‌బోట్‌లో బస చేసే అవకాశం ఈ టూర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
డిసెంబర్ 6న టూర్ ప్రారంభం
ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
- ప్యాకేజీ పేరు: Cultural Keralam
- ప్యాకేజీ కోడ్: SHA35
- ప్రయాణ తేదీ: 2026 డిసెంబర్ 6
- ప్రయాణ ప్రారంభ స్థానం: హైదరాబాద్ విమానాశ్రయం
- ప్రయాణ విధానం: విమానం
- టూర్ వ్యవధి: 6 రాత్రులు, 7 రోజులు
- క్లాస్: కంఫర్ట్
- గ్రూప్ పరిమాణం: 29 మంది
ఏడు రోజుల టూర్ షెడ్యూల్ ఇదే..
మొదటి రోజు: డిసెంబర్ 6న ఉదయం 9:40 గంటలకు హైదరాబాద్ నుంచి 6E 6707 విమానంలో బయలుదేరి ఉదయం 11:20 గంటలకు కొచ్చి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లిన తర్వాత డచ్ ప్యాలెస్, మెరైన్ డ్రైవ్ వంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తారు.
రెండో రోజు: కొచ్చి నుంచి గురువాయూర్కు ప్రయాణించి ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన మున్నార్‌కు బయలుదేరుతారు.
మూడో రోజు: మున్నార్‌లోని అందమైన పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. పచ్చని టీ తోటలు, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.
నాలుగో రోజు: మున్నార్ నుంచి థెక్కడికి ప్రయాణం ఉంటుంది. అక్కడి సుగంధ ద్రవ్యాల తోటలను సందర్శించే అవకాశం కల్పిస్తారు.
ఐదో రోజు: కుమారకోమ్ చేరుకున్న తర్వాత హౌస్‌బోట్‌లో బస చేస్తారు. కేరళ బ్యాక్‌వాటర్స్ అందాలను వీక్షిస్తూ పడవ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఈ రోజుకు సంబంధించిన లంచ్, డిన్నర్ కూడా ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.
ఆరవ రోజు: కుమారకోమ్ నుంచి వర్కలకు చేరుకుని అక్కడి ప్రసిద్ధ బీచ్‌ను సందర్శిస్తారు. అనంతరం తిరువనంతపురం వెళ్లి హోటల్లో బస చేస్తారు.
ఏడో రోజు: ఉదయం శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత అజిమల శివాలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 5:20 గంటలకు విమానంలో బయలుదేరి రాత్రి 7:05 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
ఒక్కొక్కరికి టూర్ ప్యాకేజీ ధర ఎంతంటే?
ప్రయాణికుల వసతి విధానాన్ని బట్టి IRCTC వేర్వేరు ధరలను నిర్ణయించింది.
- సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.62,900
- డబుల్ ఆక్యుపెన్సీ: రూ.45,900
- ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.43,100
- 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు (బెడ్‌తో): రూ.36,850
- 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు (బెడ్ లేకుండా): రూ.32,400
- 2 నుంచి 4 ఏళ్ల పిల్లలకు (బెడ్ లేకుండా): రూ.22,250
ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?
ఈ టూర్ ప్యాకేజీలో విమాన ప్రయాణ టికెట్లు, హోటల్ మరియు హౌస్‌బోట్ వసతి, ఆరు రోజుల బ్రేక్‌ఫాస్ట్‌లు, ఆరు డిన్నర్లు, రెండు లంచ్‌లు అందిస్తారు. అలాగే ఏసీ బస్సులో స్థానిక సందర్శనలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సేవలు, వర్తించే పన్నులు కూడా ధరలోనే ఉంటాయి.
అయితే ఆలయాలు, పర్యాటక ప్రాంతాల ప్రవేశ రుసుములు, ప్రత్యేక దర్శన టికెట్లు, వ్యక్తిగత ఖర్చులు, టూర్ గైడ్ సేవలు, విమాన ప్రయాణంలో భోజనం, అదనపు ఆహార ఖర్చులు మాత్రం ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
ముఖ్య గమనిక: వాతావరణ పరిస్థితులు, ఇతర కార్యాచరణ కారణాల వల్ల విమాన సమయాలు, టూర్ షెడ్యూల్లో మార్పులు ఉండవచ్చు. టికెట్ బుక్ చేసుకునే ముందు IRCTC అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలు పరిశీలించడం మంచిది.
బుకింగ్ వివరాలు: IRCTC అధికారిక వెబ్సైట్లో SHA35 ప్యాకేజీ ద్వారా టూర్ వివరాలు, బుకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
IRCTC Cultural Keralam Tour Booking
