
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం కొత్త జీవిత బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందిరమ్మ బీమా పేరుతో అమలు చేయనున్న ఈ పథకం ద్వారా కుటుంబ పెద్ద మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకం ప్రారంభ తేదీని కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.
తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ బీమా పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఈ పథకం ప్రధాన ఉద్దేశం కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం. కుటుంబ పెద్ద మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పరిహారం అందించనున్నారు. ప్రమాదవశాత్తు మరణించినా, సహజ మరణం సంభవించినా బీమా వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నాయి. బీమా కోసం లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించనుంది. ఇందుకోసం ఇప్పటికే బీమా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.
నవంబర్ 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఇందిరమ్మ బీమా పథకం అమలులో భాగంగా నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు స్వీకరించనున్నాయి. అనంతరం రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన కుటుంబాలను గుర్తించనున్నారు. అర్హత కలిగిన వారిని పథకం లబ్ధిదారులుగా నమోదు చేయనున్నారు.
ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే ఈ పథకం లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా ప్రైవేట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ప్రీమియం చెల్లించడంతోపాటు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఇందిరమ్మ బీమా ద్వారా అర్హులైన కుటుంబాలకు ఉచితంగా జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు.
నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ
మరోవైపు నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు చీరలను పంపించినట్లు సమాచారం. పంపిణీకి అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు.
గతంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, చీరల తయారీలో జాప్యం కారణంగా పంపిణీ ఆలస్యమైంది. ప్రస్తుతం వివిధ రంగులు, డిజైన్లలో చీరలను సిద్ధం చేయడంతో నవంబర్ 19 నుంచి పంపిణీ చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇలా ఒకవైపు ఇందిరమ్మ బీమా పథకం ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు, మరోవైపు మహిళలకు ఇందిరమ్మ చీరలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
