
రసాయనాలు కలిపి కృత్రిమంగా పాలను తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఓ పాల వ్యాపారి బాగోతాన్ని మహేశ్వరం SOT పోలీసులు బయటపెట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో నిర్వహిస్తున్న కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడి చేసి భారీగా రసాయనాలు, పాల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
లాభాల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. నాణ్యమైన పాలను అందించాల్సింది పోయి ప్రమాదకర రసాయనాలు కలిపి కృత్రిమ పాలను తయారుచేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు సరఫరా అవుతున్న కల్తీ పాల వ్యవహారం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
విశ్వసనీయ సమాచారం అందడంతో మహేశ్వరం SOT పోలీసులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలోని ఓ పాల తయారీ కేంద్రంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల తయారీలో హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో పాటు ‘ధోల్పూర్’ బ్రాండ్‌కు చెందిన మిల్క్ పౌడర్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
ఈ అక్రమ దందా నిర్వహిస్తున్న పోచారం గ్రామానికి చెందిన అందె శ్రీశైలం (43)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్రంలో తనిఖీలు నిర్వహించి 100 లీటర్ల కల్తీ పాలు, ఒక లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, 35 కిలోల మిల్క్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కేసు నమోదు కోసం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ కేంద్రంలో తయారుచేసిన కల్తీ పాలను హైదరాబాద్‌లోని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
కల్తీ పాలు తాగితే ప్రాణాలకే ప్రమాదం!
పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను కలపడం అత్యంత ప్రమాదకరం. సాధారణంగా ఈ రసాయనాన్ని కొన్ని పారిశ్రామిక, శుభ్రపరిచే అవసరాలకు ఉపయోగిస్తారు. అయితే ఇలాంటి రసాయనాలు కలిపిన పాలను తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
కల్తీ పాలు తాగిన వెంటనే కడుపులో మంట, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. రసాయనం అధిక మోతాదులో శరీరంలోకి చేరితే కడుపు, పేగుల లోపలి పొరలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, అంతర్గత గాయాలు కూడా సంభవించవచ్చు.
హైడ్రోజన్ పెరాక్సైడ్ అధిక గాఢతలో శరీరంలోకి చేరితే మరింత తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. రక్తనాళాల్లో ఆక్సిజన్ బుడగలు ఏర్పడి రక్తప్రసరణకు ఆటంకం కలిగించే గ్యాస్ ఎంబాలిజం సమస్య తలెత్తవచ్చు. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి, స్పృహ కోల్పోవడం వంటి ప్రాణాపాయ లక్షణాలు కనిపించవచ్చు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాలు అనుమానాస్పదంగా అనిపిస్తే వాటిని వినియోగించకూడదు. కల్తీ పాలు తాగినట్లు అనుమానం ఉన్నా, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కనిపించినా వెంటనే వైద్య సహాయం పొందాలి.
