
మేడ్చల్ జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు భారీగా పడిపోవడంతో వేసవి రాకముందే నీటి ఎద్దడి పరిస్థితులు నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. అక్టోబర్ నెల చివరి నాటికి సగటున 6.66 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మేడ్చల్ జిల్లాలోని 15 మండలాల్లో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో రాబోయే వర్షాకాలం వరకు ప్రజలకు నీటి సరఫరా ఎలా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో నీటి సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు జిల్లాలోని పలు చెరువుల నుంచి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు అక్రమంగా నీటిని తరలిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. బోర్లు ఎండిపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అవకాశంగా తీసుకుని చెరువుల్లోని నీటిని ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తూ కొందరు యజమానులు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మండలాల వారీగా భూగర్భ జలాల పరిస్థితి ఇలా ఉంది:
- అల్వాల్ – 3.74 మీటర్లు
- బాచుపల్లి – 0.40 మీటర్లు
- బాలానగర్ – 3.60 మీటర్లు
- దుండిగల్ – 9.82 మీటర్లు
- ఘట్‌కేసర్ – 5.00 మీటర్లు
- కాప్రా – 6.46 మీటర్లు
- కీసర – 5.02 మీటర్లు
- కూకట్‌పల్లి – 6.90 మీటర్లు
- మూడుచింతలపల్లి – 5.42 మీటర్లు
- మల్కాజిగిరి – 8.49 మీటర్లు
- మేడ్చల్ – 7.40 మీటర్లు
- మేడిపల్లి – 13.06 మీటర్లు
- కుత్బుల్లాపూర్ – 7.74 మీటర్లు
- శామీర్‌పేట్ – 4.51 మీటర్లు
- ఉప్పల్ – 8.40 మీటర్లు
ముఖ్యంగా మేడిపల్లి మండలంలో అత్యధికంగా 13.06 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోగా, దుండిగల్‌లో 9.82 మీటర్లకు చేరాయి. ఈ పరిస్థితులు జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణ, నీటి వినియోగంపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
