
D Spiritual: Nov 6: యాదగిరిగుట్టలో వైభవంగా లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆలయ ఆస్థాన ముఖమండపంలో ఉత్సవమూర్తులను వివిధ రకాల పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేసి, ప్రధానార్చక బృందం వేదమంత్రోచ్ఛారణల మధ్య లక్ష పుష్పాలతో అర్చన నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక బృందంతో పాటు దేవస్థాన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
