
చికెన్ కర్రీని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. అయితే శెనగపప్పు కలిపి చేసే చికెన్ కర్రీ రుచి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చికెన్ ముక్కలకు మసాలా రుచి, శెనగపప్పు కలవడంతో కూర మరింత రుచిగా, చిక్కటి గ్రేవీతో తయారవుతుంది. సాధారణ చికెన్ కర్రీకి భిన్నంగా ఉండే ఈ వంటకాన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ స్పెషల్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు
- చికెన్ – అర కిలో
- పచ్చి శెనగపప్పు – అర కప్పు
- ఉల్లిపాయలు – 2 పెద్దవి
- పచ్చిమిరపకాయలు – 4
- నూనె – తగినంత
- ఉప్పు – రుచికి సరిపడా
- కారం – 3 టీస్పూన్లు
- పసుపు – అర టీస్పూన్
- కొత్తిమీర – కొద్దిగా

మసాలా తయారీకి:
- ధనియాలు – 2 టీస్పూన్లు
- జీలకర్ర – 1 టీస్పూన్
- అల్లం – చిన్న ముక్క
- వెల్లుల్లి – 7 నుంచి 8 రెబ్బలు
- కొబ్బరి ముక్క – చిన్నది
- జీడిపప్పు – 4 నుంచి 5
- దాల్చిన చెక్క – చిన్న ముక్క
- లవంగాలు – 4 నుంచి 5
- యాలకులు – 2
తయారీ విధానం
1. శెనగపప్పును నానబెట్టుకోవాలి: ముందుగా పచ్చి శెనగపప్పును రెండు సార్లు శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి కనీసం 30 నిమిషాల నుంచి గంట వరకు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది.
2. చికెన్‌ను మ్యారినేట్ చేయాలి: అర కిలో చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, అర టీస్పూన్ కారం, అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. మసాలా చికెన్ ముక్కలకు పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. మసాలా పేస్ట్ తయారు చేయాలి: మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
4. ఉల్లిపాయలను వేయించాలి: స్టవ్‌పై పాన్ పెట్టి తగినంత నూనె పోయాలి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
5. చికెన్, శెనగపప్పు కలపాలి: ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్‌ను పాన్‌లో వేసి బాగా కలపాలి. కొద్దిసేపు నూనెలో వేగిన తర్వాత నానబెట్టిన శెనగపప్పును కూడా వేసి మరో నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి.
6. మసాలా వేసి ఉడికించాలి: ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ను చికెన్‌లో వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం మంటపై సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి.
7. కారం, నీళ్లు కలపాలి: ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మూడు టీస్పూన్ల కారం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అనంతరం ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా కలపాలి. మూత పెట్టి హై ఫ్లేమ్‌పై ఐదు నిమిషాలు ఉడికించాలి.
8. గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి: ఆ తర్వాత మంటను మీడియంకు తగ్గించి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. చివరగా సిమ్‌లో పెట్టి చికెన్, శెనగపప్పు పూర్తిగా ఉడికే వరకు, గ్రేవీ చిక్కబడే వరకు ఉంచాలి. పప్పు ఇంకా గట్టిగా ఉంటే కొద్దిగా వేడి నీళ్లు పోసి మరికొంతసేపు ఉడికించుకోవాలి.
9. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి: చివరగా తరిగిన కొత్తిమీర చల్లి ఒక నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. నోరూరించే శెనగపప్పు చికెన్ కర్రీ సిద్ధం!

అన్నం, చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్
చిక్కటి గ్రేవీ, మసాలా రుచితో ఉండే ఈ శెనగపప్పు చికెన్ కర్రీ వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా రోటీ, చపాతీ, దోశ, ఇడ్లీతో కూడా తినవచ్చు. ఇంట్లోనే ఈ సరికొత్త చికెన్ రెసిపీని తయారు చేసి కుటుంబ సభ్యులకు వడ్డించండి!
