Hyderabad Metro Ticketing Issues: Automatic Gates Refuse Entry and Exit at Intermediate Stations

హైదరాబాద్‌: నగర మెట్రో రైలు టికెటింగ్‌ విధానంలోని కొన్ని నిబంధనలు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. టికెట్‌లో పేర్కొన్న స్టేషన్‌ కాకుండా మధ్యలోనే దిగాలన్నా, వేరే స్టేషన్‌లో మెట్రో ఎక్కాలన్నా ఆటోమేటిక్‌ గేట్లు తెరుచుకోవడం లేదు. దీంతో ప్రయాణికులు స్టేషన్‌ కంట్రోలర్లను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతోంది.

మధ్యలో దిగాలన్నా తప్పని తిప్పలు

గోపి అనే ప్రయాణికుడు ఎల్బీనగర్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు వెళ్లేందుకు మెట్రో టికెట్‌ తీసుకున్నారు. అయితే అత్యవసర పని కారణంగా నాంపల్లి స్టేషన్‌లోనే దిగాల్సి వచ్చింది. బయటకు వెళ్లేందుకు క్యూఆర్‌ కోడ్‌ ఉన్న పేపర్‌ టికెట్‌ను గేటు వద్ద స్కాన్‌ చేయగా అది తెరుచుకోలేదు. దీంతో స్టేషన్‌ కంట్రోలర్‌ను సంప్రదించాల్సి వచ్చింది. సిబ్బంది తమ వద్ద ఉన్న కార్డును స్కాన్‌ చేయడంతో ఆయన బయటకు వెళ్లగలిగారు.

మరో ప్రయాణికుడు జీవన్‌ యాప్‌ ద్వారా జేఎన్‌టీయూ నుంచి బేగంపేట వరకు డిజిటల్‌ టికెట్‌ కొనుగోలు చేశారు. అయితే స్నేహితుడి బైక్‌పై కేపీహెచ్‌బీ స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి మెట్రో ప్రయాణం ప్రారంభించేందుకు ప్రయత్నించారు. కానీ టికెట్‌లో పేర్కొన్న ప్రారంభ స్టేషన్‌ వేరుగా ఉండటంతో గేటు తెరుచుకోలేదు.

అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే!

టికెట్‌లో పేర్కొన్న గమ్యస్థానం కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఆటోమేటిక్‌ గేట్లు తెరుచుకోవు. అదనంగా ప్రయాణించిన దూరానికి సంబంధించిన ఛార్జీలు చెల్లించిన తర్వాతే స్టేషన్‌ కంట్రోలర్‌ బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. టికెట్‌ తీసుకున్న దూరం కంటే ఎక్కువ ప్రయాణించినప్పుడు మెట్రోకు నష్టం కలగకుండా ఈ విధానం అమలు చేయడం సమంజసమేనని భావిస్తున్నప్పటికీ, నిర్ణయించిన దూరం కంటే ముందే దిగాలనుకునే వారికి కూడా ఇబ్బందులు ఎందుకు కలిగిస్తున్నారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

రద్దీ వేళల్లో మరింత ఇబ్బంది

కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం కొంతమంది ప్రయాణికులు మొబైల్‌ యాప్‌ల ద్వారా డిజిటల్‌ టికెట్లు బుక్‌ చేస్తున్నారు. అయితే టికెట్‌లో ఎంచుకున్న స్టేషన్‌ నుంచే ప్రయాణం ప్రారంభించాల్సి ఉండటంతో ఇతర స్టేషన్ల నుంచి మెట్రో ఎక్కేందుకు వీలుకావడం లేదు. అలాగే మధ్యలో దిగాల్సి వచ్చినా గేట్లు తెరుచుకోకపోవడంతో సిబ్బంది సహాయం తీసుకోవాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో ఈ ప్రక్రియ వల్ల ప్రయాణికులు అదనపు సమయం వెచ్చించాల్సి వస్తోంది.

టికెట్‌లోనే స్టేషన్ల వివరాలు నమోదు

టికెట్‌ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణికులు ఎక్కాల్సిన స్టేషన్‌, దిగాల్సిన స్టేషన్‌ వివరాలు కోడ్‌ రూపంలో నమోదు అవుతాయని మెట్రో సిబ్బంది వివరిస్తున్నారు. నిర్ణయించిన స్టేషన్లకు భిన్నంగా ఇతర స్టేషన్లలో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే వ్యవస్థ గుర్తించదని చెబుతున్నారు. అయితే మధ్యలో ఎక్కడం, దిగడం వంటి సందర్భాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టికెటింగ్‌ విధానంలో వెసులుబాటు కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *