Two School Students Missing in Hyderabad’s Nagole: Four Police Teams Launch Search Operation

తల్లి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన అన్నదమ్ములు.. సీసీ కెమెరాల్లో కీలక దృశ్యాలు.. ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌ వైపు వెళ్లినట్లు అనుమానం

హైదరాబాద్, నవంబర్ 4: నగరంలోని నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. తల్లి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన అన్నదమ్ముల ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

నాగోల్‌లోని సాయిరాంనగర్‌, రోడ్‌ నంబర్‌ 3లో నివాసం ఉంటున్న మొగిలి రవి, శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వరుణ్‌ తేజ్‌ నాగోల్‌ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి, చిన్న కుమారుడు మహేష్‌ రెండో తరగతి చదువుతున్నారు. శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు ఇద్దరూ నిరాకరించడంతో తల్లి వారిని మందలించినట్లు సమాచారం.

అనంతరం పిల్లలను స్కూల్‌కు పంపేందుకు ఆటోలో కూర్చోబెట్టిన తల్లి.. ఇంట్లో ఉన్న పాఠశాల బ్యాగులు తీసుకురావడానికి లోపలికి వెళ్లింది. ఈ సమయంలో ఇద్దరు బాలురు ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తిరిగి వచ్చిన తల్లికి పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీ కెమెరాల్లో కీలక ఆధారాలు

ఫిర్యాదు అందుకున్న నాగోల్‌ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సాయినగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ కిరాణా దుకాణంలో ఇద్దరు బాలురు చాక్లెట్లు కొనుగోలు చేసిన దృశ్యాలు గుర్తించినట్లు సమాచారం.

అక్కడి నుంచి వారు ఉప్పల్‌ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఇద్దరు చిన్నారులు రోడ్డు దాటుతున్న దృశ్యాలు కూడా కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. అనంతరం ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌ వైపు వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు

చిన్నారుల ఆచూకీ కోసం మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ ఏసీపీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషిస్తూ, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇద్దరు చిన్నారులు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *