నిరుపేద యువతులు, మహిళలే లక్ష్యంగా గుట్టుగా దందా

ఐవీఎఫ్‌ పేరుతో లక్షల రూపాయల వసూళ్లు.. అండదాతల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

హైదరాబాద్‌: నిరుపేద యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని నగరంలో గుట్టుగా సాగుతున్న అక్రమ అండాల సేకరణ దందా వారి ప్రాణాలకే ముప్పుగా మారుతోంది. ఇటీవల పోలీసులు ఈ అక్రమ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాధితులుగా ఉన్న 30 మంది మహిళలు, యువతులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌తో పాటు రక్తపరీక్షలు చేయగా.. కొందరిలో అండాల సేకరణ అనంతరం ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు.

హబ్సిగూడ, బంజారాహిల్స్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లోని కొన్ని సంతాన సాఫల్య కేంద్రాల కోసం దళారులు పేద యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. నిరుద్యోగ యువకులు, ఆటో డ్రైవర్లను కూడా ప్రలోభపెట్టి వారి నుంచి వీర్యకణాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సంతానం లేని దంపతులకు అండాలు, వీర్యకణాల ద్వారా ఐవీఎఫ్‌ చికిత్స అందించి సంతానం కలిగేలా చేస్తామంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కొంతకాలంగా ఈ వ్యవహారం వ్యవస్థీకృతంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

అనుమతులు, వైద్యుల పర్యవేక్షణ, అవసరమైన నిబంధనలు పాటించకుండా అండాలను సేకరించడం వల్ల మహిళల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఉంటుందని గాంధీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అనధికారిక కేంద్రాల్లో అండాల సేకరణ చేపడితే ఓవేరియన్‌ హైపర్‌స్టిమ్యులేషన్‌ సిండ్రోమ్‌ (OHSS) వచ్చే ప్రమాదం ఉంది.

అండాల ఉత్పత్తిని పెంచేందుకు సాధారణంగా 10 నుంచి 15 రోజులపాటు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. వీటి ప్రభావంతో అండాశయాలు వాపునకు గురికావడం, కడుపులో ద్రవం చేరడం, రక్తం గడ్డకట్టడం, మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సరైన వైద్య పర్యవేక్షణ లేకపోతే ఈ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చవచ్చని వైద్యులు చెబుతున్నారు.

హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-బి, సి ముప్పు

అండాల సేకరణలో అపరిశుభ్రమైన పరికరాలు ఉపయోగిస్తే యోని, అండాశయాల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అంతర్గత రక్తస్రావం కూడా సంభవించవచ్చు. అల్ట్రాసౌండ్‌ మార్గదర్శకత్వంలో సూదిని ఉపయోగించి అండాలను సేకరించే సమయంలో అండాశయం సమీపంలోని పెద్ద రక్తనాళాలు దెబ్బతింటే తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయం ఏర్పడవచ్చు.

అలాగే మత్తు వైద్యుల పర్యవేక్షణ లేకుండా ప్రక్రియ చేపడితే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. పదేపదే అండాలను సేకరించడం వల్ల భవిష్యత్తులో గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన రక్షణ చర్యలు పాటించకపోతే హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది.

అండాల సేకరణపై చట్టం ఏం చెబుతోంది?

అండాల సేకరణ, దానం ప్రక్రియను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ (రెగ్యులేషన్‌) చట్టం-2021ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం అండదానం, సేకరణకు సంబంధించి పలు నిబంధనలు ఉన్నాయి.

  • ఒక మహిళ తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అండదానం చేయాలి. ఆ ప్రక్రియలో గరిష్ఠంగా ఏడు అండాలను మాత్రమే సేకరించాలి.
  • ఒక అండదాత నుంచి సేకరించిన అండాలను ఒకే జంటకు కేటాయించాలి.
  • అండాల కొనుగోలు, అమ్మకం, దళారుల ద్వారా అక్రమంగా సేకరించడం చట్టవిరుద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి శిక్షలు విధించే అవకాశం ఉంది.
  • అండాల సేకరణ, నిల్వ ప్రక్రియలు ప్రభుత్వ గుర్తింపు పొందిన రిజిస్టర్డ్‌ ఏఆర్టీ బ్యాంకుల ద్వారానే జరగాలి.
  • అండదాతలకు 12 నెలల బీమా కవరేజీ కల్పించాలి. అండాల సేకరణ సమయంలో లేదా అనంతరం ఆరోగ్య సమస్యలు తలెత్తితే బీమా ద్వారా పరిహారం పొందే అవకాశం ఉంటుంది.

విదేశీ ఉద్యోగాలు, ఆర్థిక ఇబ్బందుల పేరుతోనే కాకుండా సంతాన సాఫల్య చికిత్సల కోసం కూడా పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని అక్రమ దందాలు సాగుతున్నాయనే విషయం ఆందోళన కలిగిస్తోంది. అండదానం విషయంలో మహిళలు ముందుగా చట్టబద్ధమైన కేంద్రాలను, వైద్యుల పర్యవేక్షణను నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *