D News: Nov 4: పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు గురుగ్రామ్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య తీవ్రత దృష్ట్యా నవంబర్ 5 నుంచి నవంబర్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా దుమ్ము రేపే నిర్మాణ, కూల్చివేత పనులపై తాత్కాలిక నిషేధం విధించింది. జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిర్మాణ పనులపై ఆంక్షలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు కూడా కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. గురుగ్రామ్‌లోని హర్యానా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగుల్లో 50 శాతం మందికి మాత్రమే కార్యాలయాలకు వచ్చి పనిచేసే అవకాశం కల్పించాలని ఆదేశించారు. మిగిలిన 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఉత్తమ్ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నవంబర్ 5 నుంచి 20 వరకు అమల్లో ఉండే నిర్మాణ నిషేధం జాతీయ రహదారులు, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఓవర్‌బ్రిడ్జిలు, పైప్‌లైన్లు తదితర మౌలిక సదుపాయాల పనులకు వర్తించనుంది. అయితే అత్యవసర సేవలకు, కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. రైల్వేలు, మెట్రో ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, ఆసుపత్రులు, నీటి సరఫరా వ్యవస్థలు, పారిశుధ్య సదుపాయాలు, జాతీయ భద్రతకు సంబంధించిన నిర్మాణ పనులను యథావిధిగా కొనసాగించేందుకు అనుమతించారు. పారిశ్రామిక సంస్థలు, అత్యవసర సేవలకు కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించారు.

మరోవైపు కార్యాలయాల్లో 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగుల హాజరు వివరాలను రోస్టర్ల రూపంలో నమోదు చేసి భద్రపరచాలని సంస్థలకు సూచించారు. కార్యాలయాలకు రాకపోకలు తగ్గించడం ద్వారా వాహనాల రద్దీని, తద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని యంత్రాంగం భావిస్తోంది.

ఈ ఆంక్షలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు. సంబంధిత సబ్‌ డివిజనల్ మేజిస్ట్రేట్‌లు (SDMలు), హర్యానా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులకు తనిఖీల బాధ్యతలు అప్పగించారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *