
కడెం ప్రాజెక్టు నుంచి సాగునీటి సరఫరాను అధికారులు నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. వరి పంటకు నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగునీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. కడెం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను నిలిపివేయడంతో సాగు పనులు, వరి పంటలపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి సాగునీటిని విడుదల చేయాలని కోరారు.
తమ డిమాండ్‌ను పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని రైతులు హెచ్చరించారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
