
AP and Telangana Weather Alert: తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల ప్రభావంతో తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అంచనాలను వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ, RTGS సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలోనూ వర్షాలు.. ఈ జిల్లాల్లో అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణపై కూడా కనిపించనుంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.
తెలంగాణలో వర్షాలు కురిసే జిల్లాలివే
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇక ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని సూచించారు.
