
Jagtial Child: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగిత్యాల చిన్నారి దత్తత వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. చిన్నారిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని, బాలుడిని తిరిగి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సంరక్షణలోకి పంపాలని పిటిషన్ దాఖలు చేశారు.
‘అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’ అంటూ శిశు సంక్షేమ కేంద్రంలో చిన్నారి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించినప్పటికీ వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
అసలు వివాదం ఏమిటంటే..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్దెకు చెందిన సరిత, శ్రీనివాస్‌గౌడ్ దంపతులకు సంతానం లేకపోవడంతో సుమారు మూడేళ్ల క్రితం కోరుట్లకు చెందిన ఓ దంపతుల నుంచి నెల రోజుల వయసున్న శిశువును తీసుకుని పెంచుకుంటున్నారు. తల్లి మరణించిన ఆ చిన్నారిని తమ సొంత బిడ్డగా భావిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు.
అయితే శ్రీనివాస్‌గౌడ్ బంధువుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదాల నేపథ్యంలో బాలుడి దత్తత చట్టబద్ధంగా జరగలేదని అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు సెప్టెంబర్ 16న చిన్నారిని పెంపుడు తల్లిదండ్రుల నుంచి తీసుకుని కరీంనగర్‌లోని శిశుగృహకు తరలించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సరిత, శ్రీనివాస్ దంపతులు తమ బిడ్డను తిరిగి అప్పగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
వారి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అక్టోబర్ 16న బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అధికారులు చిన్నారిని అప్పగించడంలో జాప్యం చేయడంతో దంపతులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో శిశుగృహలో చిన్నారిని కలిసేందుకు వెళ్లినప్పుడు ‘డాడీ.. ఇంటికి తీసుకెళ్లు.. అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’ అంటూ బాలుడు రోదించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో పెద్దఎత్తున స్పందన వ్యక్తమైంది.
చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు చిన్నారిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించారు. దాదాపు రెండు నెలల పాటు బిడ్డకు దూరంగా ఉన్న ఆ దంపతులు తిరిగి చిన్నారి తమ వద్దకు చేరుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు.
హైకోర్టు ఉత్తర్వులపై కలెక్టర్ అభ్యంతరం
ఇదిలా ఉండగా, చిన్నారిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత కలెక్టర్ సత్యప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. సీడబ్ల్యూసీ నిబంధనలు, అధికారులు సమర్పించిన ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే బాలుడిని అప్పగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని కలెక్టర్ తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
హిందూ సంప్రదాయాల ప్రకారం దత్తత తీసుకున్నంత మాత్రాన అది చట్టబద్ధమైన దత్తతగా పరిగణించవచ్చా? అనే అంశాన్ని పరిశీలించాలని న్యాయస్థానాన్ని కోరినట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలని, విచారణ పూర్తయ్యే వరకు చిన్నారిని తిరిగి సీడబ్ల్యూసీ సంరక్షణలోకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.
అలాగే చిన్నారి పెంపుడు తల్లిదండ్రుల వద్ద ఉండటం వల్ల విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులు కూడా ఈ వ్యవహారంపై రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి చిన్నారి దత్తత వ్యవహారం మరోసారి న్యాయస్థానం ముందుకు చేరడంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. బాలుడి భవిష్యత్తు, దత్తత చట్టబద్ధతపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
