
తెలంగాణ ఆర్టీసీలో విషాదం చోటుచేసుకుంది. చిల్లర విషయంలో ప్రయాణికురాలితో జరిగిన వివాదం కారణంగా బస్సు కిందపడి తీవ్రంగా గాయపడిన మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) చికిత్స పొందుతూ మృతిచెందారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
గత నెల 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో మౌనిక అనే మహిళ తన కుమారుడితో కలిసి ప్రయాణించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెంలో దిగేందుకు తన కుమారుడికి హాఫ్ టికెట్ ఇవ్వాలని కోరుతూ కండక్టర్ ప్రవళికకు రూ.100 నోటు ఇచ్చింది. ఈ క్రమంలో చిల్లర విషయంలో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది.
మిట్టగూడెం స్టాప్ వద్ద ప్రయాణికురాలు బస్సు దిగేందుకు ప్రయత్నించగా, కండక్టర్ ప్రవళిక ఆమెను డోర్ వద్ద నిలువరించారు. అయితే బస్సు స్టాప్ దాటి వెళ్తున్న సమయంలో ప్రయాణికురాలు ప్రవళికను నెట్టివేయడంతో ఆమె రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో బస్సు వెనుక టైర్లు ఆమె కుడికాలుపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. కాలు పూర్తిగా నుజ్జునుజ్జయింది.
తొలుత స్థానికంగా చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రవళికను హైదరాబాద్లోని ఎల్బీనగర్ సంజీవని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారు.
ప్రవళిక మృతిపై కార్మిక సంఘాల దిగ్భ్రాంతి
కండక్టర్ ప్రవళిక మృతితో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సహా పలు కార్మిక సంఘాల నేతలు ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రవళిక కుటుంబాన్ని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఆదుకోవాలని కోరారు. కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ సంయుక్తంగా రూ.కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు ఆర్టీసీ బంద్
ప్రవళిక మృతికి నిరసనగా, ఆమెకు నివాళులర్పిస్తూ బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేయనున్నట్లు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ప్రకటించారు. జేఏసీ అధ్యక్షుడు పీ. కమాల్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మర్రి నరేందర్, ప్రధాన కార్యదర్శి ఎండీ మౌలానాతో పాటు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసన తెలపనున్నట్లు కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని, బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
