
D Educt: Nov 2: ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం హాజరు తప్పనిసరి.. విద్యాశాఖ కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా నవంబర్ నెల మొత్తం 100 శాతం హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. సంపూర్ణ హాజరును సాధించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతిరోజూ ముఖగుర్తింపు హాజరు తప్పనిసరి
విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిరోజూ ముఖగుర్తింపు హాజరు విధానం (FRS) ద్వారా తమ హాజరును నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచడంతో పాటు విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వరుసగా ఐదు రోజులు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం
ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులు వరుసగా పాఠశాలకు హాజరుకాని విద్యార్థులను గుర్తించాలని విద్యాశాఖ ఆదేశించింది. అలాంటి విద్యార్థుల తల్లిదండ్రులను వెంటనే సంప్రదించి, వారు పాఠశాలకు హాజరయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
వారానికోసారి హాజరుపై సమీక్ష
విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను క్లస్టర్, మండల, జిల్లా స్థాయిలో ప్రతి వారం సమీక్షించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. పాఠశాలల్లో సంపూర్ణ హాజరు ప్రాముఖ్యతపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించింది. నవంబర్ నెలలో 100 శాతం హాజరు లక్ష్యాన్ని సాధించేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది.
