
D Spiritual: Oct 31: 2027 హరిద్వార్ కుంభమేళా.. 11 పవిత్ర స్నానాల తేదీలు ప్రకటించిన అధికారులు
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 2027లో జరగనున్న కుంభమేళాకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 14న తొలి పవిత్ర స్నానం ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 20న చైత్ర పూర్ణిమతో చివరి స్నానం ముగియనుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన స్నానాల తేదీలను మేళా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా అధికారిక కుంభమేళా వెబ్సైట్లో మొత్తం 11 స్నానాల తేదీలను పొందుపరిచారు.
కుంభమేళా పవిత్ర స్నానాల తేదీలు ఇవే
2027 హరిద్వార్ కుంభమేళాలో నిర్వహించనున్న 11 ప్రధాన పవిత్ర స్నానాల తేదీలు ఇలా ఉన్నాయి.
- జనవరి 14 – మకర సంక్రాంతి
- ఫిబ్రవరి 6 – మౌని అమావాస్య
- ఫిబ్రవరి 11 – వసంత పంచమి
- ఫిబ్రవరి 20 – మాఘ పూర్ణిమ
- మార్చి 6 – మహాశివరాత్రి
- మార్చి 8 – ఫాల్గుణ అమావాస్య
- మార్చి 15 – దేవ్ డోలీ
- ఏప్రిల్ 7 – నవ సంవత్సర్
- ఏప్రిల్ 14 – మేష సంక్రాంతి
- ఏప్రిల్ 15 – రామ నవమి
- ఏప్రిల్ 20 – చైత్ర పూర్ణిమ
నాలుగు అమృత స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యం
కుంభమేళాలో కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో నిర్వహించే పవిత్ర స్నానాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. అధికారిక వెబ్సైట్ ప్రకారం.. మార్చి 6న మహాశివరాత్రి, మార్చి 8న ఫాల్గుణ అమావాస్య, మార్చి 15న దేవ్ డోలీ, ఏప్రిల్ 14న మేష సంక్రాంతి సందర్భంగా నిర్వహించే స్నానాలను అమృత స్నానాలుగా పేర్కొన్నారు. వీటిలో ఏప్రిల్ 14న జరిగే మేష సంక్రాంతి స్నానాన్ని ప్రధాన అమృత స్నానంగా గుర్తించారు.
భక్తుల కోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు
కుంభమేళాకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మేళా ప్రాంతాన్ని నాలుగు జిల్లాలు, 32 సెక్టార్లుగా విభజించి నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర రాజ్‌భవన్ సెప్టెంబరు 30న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
భక్తుల సౌకర్యార్థం ఘాట్లు, వంతెనలు, రహదారుల వంటి శాశ్వత మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ సహా వివిధ భద్రతా విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతున్నారు. కుంభమేళా స్నానాల తేదీలు, ఇతర ఏర్పాట్లకు సంబంధించి అధికారులు రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
