ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన తనిఖీల నివేదిక ఆధారంగా కృత్రిమ పన్నీరు తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలు, వినియోగంపై ఏడాది పాటు నిషేధం విధించినట్లు పేర్కొంది. ఆహార పదార్థాల నాణ్యతను కాపాడటం, కల్తీ ఉత్పత్తుల వల్ల ప్రజలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించడం ఈ చర్య ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

ప్రజారోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృత్రిమ పన్నీరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కృత్రిమ పన్నీరు తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలు, వినియోగంపై ఏడాది పాటు నిషేధం విధించింది. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఆహార భద్రతను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఆహార భద్రత శాఖ కమిషనర్‌ పేరుతో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారులు నిర్వహించిన విస్తృత తనిఖీల నివేదిక ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

ఇటీవల సంప్రదాయ పద్ధతిలో పాల నుంచి తయారు చేసే పన్నీర్‌కు బదులుగా కొన్ని చోట్ల కృత్రిమ పన్నీరు వినియోగం పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. శాఖాహార కొవ్వులు, పామాయిల్‌, పాలపొడి వంటి పదార్థాలతో వీటిని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ ధరకు లభిస్తుండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్లలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. మరికొన్ని ప్రాంతాల్లో కృత్రిమ చీజ్‌ను కూడా పన్నీరు పేరుతో వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంప్రదాయ పన్నీరు, కృత్రిమ పన్నీరు మధ్య తేడాను సాధారణ వినియోగదారులు గుర్తించడం కష్టంగా మారడంతో ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యానికి ముప్పు కలగకుండా ప్రభుత్వం నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే పన్నీరు ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా కృత్రిమ పన్నీరు విక్రయాలను అరికట్టేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని FSSAI సూచించినట్లు కూడా అధికారులు వెల్లడించారు.