
D News: Oct 16: ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలపై సీఎం చంద్రబాబు ప్రశంసలు.. భువనేశ్వరికి అభినందనలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ (ఎన్టీఆర్ ట్రస్ట్) అందిస్తున్న సేవలను కొనియాడారు. విజయవాడలో నూతనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ట్రస్ట్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. రక్తం అందక ఏ ఒక్కరి ప్రాణమూ ప్రమాదంలో పడకూడదనే గొప్ప సంకల్పంతో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా అవసరమైన వారికి సకాలంలో రక్తం అందించి ప్రాణాలను కాపాడేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.
నారా భువనేశ్వరి, ఆమె బృందానికి అభినందనలు
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, తన అర్ధాంగి నారా భువనేశ్వరితో పాటు ఆమె బృందాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఒక్కరి రక్తదానం ఆపదలో ఉన్న మరో కుటుంబానికి జీవనాధారంగా నిలుస్తుందని, ప్రాణాపాయంలో ఉన్నవారికి కొత్త జీవితాన్ని అందించగలదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా రక్తం అందించాలని తీసుకున్న నిర్ణయం గొప్ప మానవీయ సేవకు నిదర్శనమని కొనియాడారు.
విద్య, వైద్య రంగాల్లోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు
ఎన్టీఆర్ ట్రస్ట్ కేవలం రక్తనిధి సేవలకే పరిమితం కాకుండా విద్య, వైద్యం, మహిళా సాధికారత వంటి పలు రంగాల్లో సేవలు అందిస్తోందని చంద్రబాబు గుర్తుచేశారు. ముఖ్యంగా ‘సంజీవని మొబైల్ క్లినిక్స్’ ద్వారా మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. అవసరమైన వారికి వైద్య సహాయం అందిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ట్రస్ట్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
మరింత మందికి సేవలు అందించాలని ఆకాంక్ష
ప్రతి సేవలో మానవత్వాన్ని చాటుతూ, ప్రతి ప్రయత్నంలో ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రక్తనిధి సేవలతో పాటు విద్య, వైద్యం, మహిళా సాధికారత వంటి రంగాల్లోనూ సేవలను మరింత విస్తరించి, అవసరంలో ఉన్న మరెంతో మందికి అండగా నిలవాలని కోరారు.
