
D Spiritual: Oct 16: శ్రీ శివరామకృష్ణ దేవాలయంలో ఘనంగా సరస్వతీదేవి పూజలు
నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ శివరామకృష్ణ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ఈవో టి. శివకేశవరావు సారథ్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు.
ఆలయ అర్చకులు జి. భార్గవ శర్మ శైవాగమ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధూప, దీప, నైవేద్యాలతో పాటు మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు సామూహికంగా శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహించడంతో పాటు దీపారాధన చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
సరస్వతీదేవి పూజలో పాల్గొన్న చిన్నారులకు పెన్నులు, పుస్తకాలను అందజేశారు. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యుడు ఎంవీ రాజశేఖర్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.
