
D Educt: Oct 11: నీట్ పీజీ 2026 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థినికి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు
నీట్ పీజీ 2026 ఫలితాల్లో తెలంగాణకు చెందిన పల్లాక్షి ప్రసాద్ జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఆమె 633 మార్కులు సాధించారు. మరో విద్యార్థిని తహ అమ్రీన్ 607 మార్కులతో జాతీయ స్థాయిలో 43వ ర్యాంకు దక్కించుకున్నారు. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో టాప్ 100లోపు ర్యాంకులు సాధించిన ఇద్దరూ అమ్మాయిలే కావడం విశేషం.
జోస్యుల చైతన్య కార్తీక్ 598 మార్కులతో జాతీయ స్థాయిలో 127వ ర్యాంకు సాధించగా, చొల్లేటి తేజ 598 మార్కులతో 129వ ర్యాంకు పొందారు. పట్కూరి మహిత శ్రీకీర్తి 597 మార్కులతో 137వ ర్యాంకు సాధించారు.
7,676 మంది అభ్యర్థులతో అర్హుల జాబితా
నీట్ పీజీ 2026 ఫలితాలు సెప్టెంబర్ 24న విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం శుక్రవారం తెలంగాణ చిరునామాతో పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 7,676 మంది ఉన్నట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
అయితే, ఈ జాబితాను స్థానిక ర్యాంకుల జాబితాగా పరిగణించలేమని అధికారులు స్పష్టం చేశారు. వీరంతా తెలంగాణ చిరునామాతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులేనని తెలిపారు. కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థుల స్థానికతకు సంబంధించిన వివరాలు స్పష్టమవుతాయని పేర్కొన్నారు.
ఈ నెల 12న నీట్ పీజీ నోటిఫికేషన్
నీట్ పీజీ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కాళోజీ విశ్వవిద్యాలయం సిద్ధమైంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
మరోవైపు, ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు 200కు పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సీట్ల పెంపుపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రవేశాల ప్రక్రియ మరింత స్పష్టంగా ముందుకు సాగనుంది.
