D Spiritual: Oct 11: అటుకుల బతుకమ్మ.. గౌరమ్మకు ప్రత్యేక పూజలు!

తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పూల పండుగ బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ‘అటుకుల బతుకమ్మ’ను నిర్వహిస్తారు. తొలిరోజైన ఎంగిలిపూల బతుకమ్మ అనంతరం రెండో రోజు జరుపుకునే ఈ వేడుకల్లో గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ సందర్భంగా తంగేడు, గునుగు, తామర తదితర రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చుతారు. సాయంత్రం వేళ మహిళలు, యువతులు ఒకచోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ జానపద పాటలు పాడుతారు. సంప్రదాయ ఆటపాటలతో పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మారుస్తారు.

సిరిసంపదలు అందించే ప్రత్యేక నైవేద్యం

అటుకుల బతుకమ్మ రోజున గౌరమ్మకు అటుకులు, ఉడికించిన సప్పిడి పప్పు, బెల్లం కలిపి ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారు. అటుకులను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉండటంతో ఈ రోజుకు ‘అటుకుల బతుకమ్మ’ అనే పేరు వచ్చింది.

ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఇళ్లలో సిరిసంపదలు పెరిగి, పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల విశ్వాసం. పూజలు పూర్తయిన అనంతరం చిన్నారులు, ముత్తైదువులకు అటుకులు, బెల్లంతో కూడిన ప్రసాదాన్ని పంచిపెట్టి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.