D Educt: Oct 11: దసరా సెలవులు లేవు.. COE విద్యార్థులకు ప్రత్యేక తరగతులు!

తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) విద్యార్థులకు ఈ దసరా పండుగ వేళ సెలవులు లేకుండా పోయాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఐటీ-జేఈఈ (IIT-JEE), నీట్ (NEET), క్లాట్ (CLAT) వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆయా సొసైటీల యాజమాన్యాలు నిర్ణయించాయి.

సిలబస్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ఈ నెల 16వ తేదీ వరకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో దసరా పండుగకు సొంత ఊళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో సమయం గడపాలని ఆశించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

సొసైటీల మధ్య సెలవుల వ్యత్యాసం

ఒకే రాష్ట్రంలో, ఒకే విధమైన విద్యా వ్యవస్థ కొనసాగుతున్నప్పటికీ గురుకుల సొసైటీల మధ్య సెలవుల విషయంలో వ్యత్యాసం ఉండటం వివాదానికి దారితీసింది. ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాలకు ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సాధారణ దసరా సెలవులు ప్రకటించగా, బీసీ, మైనారిటీ గురుకులాల COE విద్యార్థులకు మాత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.

సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు, సిబ్బంది డిమాండ్

ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇచ్చినట్లుగానే బీసీ, మైనారిటీ గురుకులాల విద్యార్థులు, సిబ్బందికి కూడా పూర్తిస్థాయిలో దసరా సెలవులు మంజూరు చేయాలని అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.

ప్రతి ఏటా కీలక పండుగల సమయంలో ప్రత్యేక తరగతుల పేరుతో సెలవులను కుదించడం వల్ల విద్యార్థులు, సిబ్బంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వారు పేర్కొంటున్నారు. అన్ని సంక్షేమ గురుకుల సొసైటీలకు ఒకే విధమైన సెలవుల నిబంధనలు అమలు చేయాలని విద్యాశాఖను కోరుతున్నారు.