
D NEWS: ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సేవ్ డెమోక్రసీ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం ప్రాంతం నుంచి లోక్‌భవన్ వరకు కూటమి నేతలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు.
ర్యాలీ లోక్‌భవన్ వద్దకు చేరుకోగానే పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి నేతలను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం పొన్నం ప్రభాకర్, మహేశ్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి తదితరులు లోక్‌భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
పోలీసులు ఆందోళన చేస్తున్న నేతలను అదుపులోకి తీసుకుని డీసీఎంలో సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల వ్యవస్థపై తమ నిరసనను వ్యక్తం చేసిన కూటమి నేతలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా, ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోనూ ఇండీ కూటమి తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు సమావేశం జరగనుంది. కన్నాట్ ప్లేస్ ప్రాంతంలోని ఓ హోటల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానంతో కూటమి నేతలకు విందు భేటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం తదుపరి రాజకీయ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
