
D Spiritual: Oct 8: బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక
మంచిర్యాల (తెలుగు ప్రభ): తెలంగాణ సంస్కృతికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రకృతిని దైవంగా భావించి పూజించే అరుదైన వేడుకగా బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే కాలక్రమేణా ఆధునిక పోకడలు, ఆడంబరాలు పెరగడంతో పండుగలోని అసలైన ఆంతర్యం, సంప్రదాయ నియమాలు కనుమరుగవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
గతంలో నిష్ఠగా కొనసాగిన సంప్రదాయం
గతంలో మహిళలు, యువతులు సాయంత్రం 4 గంటలకే బతుకమ్మ ఆటను ప్రారంభించేవారు. వీధులు, కూడళ్లలో పాటలు పాడుతూ బతుకమ్మ ఆడిన అనంతరం రాత్రి 9 నుంచి 10 గంటలలోపు చెరువుల వద్దకు చేరుకునేవారు. అక్కడ కొంతసేపు ఆట కొనసాగించి, గౌరమ్మను పూజించి రాత్రి 12 గంటలలోపే బతుకమ్మలను నిమజ్జనం చేసేవారు. పెద్దల నమ్మకం ప్రకారం ‘గౌరమ్మ నిద్ర చేయకూడదు’ అనే ఉద్దేశంతో ఈ సంప్రదాయాన్ని పాటించేవారు.
నిమజ్జనం పూర్తయిన తర్వాత ‘ఇస్తునమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం’ అంటూ గౌరమ్మను నుదుటన దిద్దుకుని, వాయినాలు ఇచ్చిపుచ్చుకునేవారు. అనంతరం అర్థరాత్రి దాటకముందే సంతోషంగా ఇళ్లకు చేరుకునేవారు.
ఆధునిక పోకడలతో మారుతున్న పద్ధతులు
ప్రస్తుతం బతుకమ్మను బయటకు తీసుకురావడమే రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జరుగుతోంది. పండుగ వెనుక ఉన్న భక్తి, భావం కంటే దుస్తుల ప్రదర్శన, వ్యక్తిగత ఆడంబరాలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. ఆడబిడ్డల నోటి నుంచి వినిపించాల్సిన జానపద బతుకమ్మ పాటలు, చప్పట్ల లయలు తగ్గిపోతుండగా.. వాటి స్థానంలో డీజేలు, రీమిక్స్ పాటల హోరు పెరుగుతోంది.
అర్థరాత్రి దాటి తెల్లవారుజాము వరకు బతుకమ్మ ఆడటం కూడా ఫ్యాషన్‌గా మారుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 12 గంటలు దాటితే గౌరమ్మ నిద్రపోతుందని, ఆ సమయంలో నిమజ్జనం చేయడం శాస్త్రోక్తం కాదని పెద్దలు చెప్పిన మాటలను నేటి తరంలో చాలామంది విస్మరిస్తున్నారు.
సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత
సంస్కృతిని గౌరవించడం అంటే మన మూలాలను కాపాడుకోవడమే. రాత్రిపూట ఆడంబరాల కోసం ఎదురుచూడకుండా, సంప్రదాయ పద్ధతిలోనే బతుకమ్మను నిర్వహించాలి. ఇంట్లో తులసికోట వద్ద బతుకమ్మను నిలిపి పూజించి, అనంతరం బతుకమ్మ కూడలికి చేరుకుని అందరితో కలిసి ఆడటం, రాత్రి 11 గంటలకల్లా నిమజ్జనం పూర్తి చేయడం వంటి పద్ధతులను కొనసాగించాలి.
గౌరమ్మ పసుపు బొట్టు, వాయినాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని సంతోషంగా ఇళ్లకు చేరుకోవడం ద్వారా పెద్దలు నేర్పిన సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చు. తెలంగాణ ఆత్మగా నిలిచిన బతుకమ్మ పండుగను డీజే సంస్కృతికి దూరంగా ఉంచి, భక్తిశ్రద్ధలతో, సంప్రదాయ కట్టుబాట్లతో జరుపుకోవాలి. గౌరమ్మను వేళకు సాగనంపుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
