D NEWS: తెలంగాణ అధికారపార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు కాంట్రాక్టు పనుల పెండింగ్ బిల్లుల విడుదల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పిస్తామని చెప్పి కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

కొన్ని నెలలుగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బిల్లులు త్వరగా విడుదల చేయిస్తామని కాంట్రాక్టర్లను సంప్రదిస్తూ, ఒక్కో బిల్లులో 12 శాతానికి పైగా కమిషన్ డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు నేరుగా కాంట్రాక్టర్లను కలుస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.

బిల్లుల విడుదలలో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారని, వారు అడిగిన మొత్తాన్ని చెల్లించి పనులు పూర్తి చేసుకున్న తర్వాత బిల్లులు విడుదల చేయించుకునే పరిస్థితి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిఫారసులతో బిల్లులు విడుదల చేయించాలని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

తమ నియోజకవర్గ పరిధిలోని కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో ఎమ్మెల్యేల సిఫారసులకు ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు కోరుతున్నారని సమాచారం. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సంబంధించిన బిల్లుల విషయంలోనూ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో ఒకే కాంట్రాక్టరుకు సంబంధించిన బిల్లుల విషయంలో పలువురు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

బిల్లుల విడుదల కోసమే కొందరు ఎమ్మెల్యేలు తనను పదేపదే కలవడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి సీనియర్ మంత్రుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా కేవలం బిల్లుల కోసం వచ్చే ఎమ్మెల్యేలపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అలాంటి ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ల విషయంలో కూడా పరిమితులు విధిస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.