
D Spiritual: Oct 2: తిరుపతిలో సమన్వయం కోసం ప్రత్యేక కోఆర్డినేషన్ సెంటర్.. టీటీడీ జేఈవో డా. ఎ. శరత్
తిరుపతి, అక్టోబర్ 2: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో తిరుపతిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జేఈవో (వైద్యం, విద్య) శ్రీ ప్రభల గోపినాథ్‌తో కలిసి శుక్రవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ.. నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతిలోని ప్రధాన ప్రాంతాల్లో ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతాలు, హోల్డింగ్ పాయింట్ల వద్ద భక్తులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, సమాచార ఫ్లెక్సీలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
భక్తులకు అవసరమైన సమాచారం స్పష్టంగా అందేలా సూచికలు, ప్రకటనలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రోజువారీగా ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు.
తిరుపతికి అనుసంధానమయ్యే నాలుగు ప్రధాన కూడళ్ల వద్ద ఆకర్షణీయమైన స్వాగత తోరణాలను ఏర్పాటు చేసి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలని జేఈవో తెలిపారు. ప్రధాన రహదారులు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ఈ వర్చువల్ సమీక్షలో సీఈ శ్రీ మనోహరం, ఎస్‌ఈ శ్రీ వేంకటేశ్వర్లు, వీజీవో శ్రీ గిరిధర, డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, టీటీడీ ట్రాన్స్‌పోర్ట్ జీఎం శ్రీ రాము, సీఎంవో శ్రీమతి కుసుమ కుమారి, డీఈలు శ్రీ రవిశంకర్ రెడ్డి, శ్రీ సరస్వతి, ఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్, అదనపు హెల్త్ ఆఫీసర్ డా. సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
